శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 02, 2020 , 03:41:50

సిద్దిపేట జిల్లాలో ఐదుగురికి కరోనా

సిద్దిపేట జిల్లాలో ఐదుగురికి కరోనా

కరోనా రక్కసి కోరలు చాస్తున్నది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని పదేపదే ప్రచారం చేస్తున్నా కొందరి నిర్లక్ష్య ధోరణితో కరోనా వ్యాధి విస్తరిస్తున్నది. బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో తొమ్మిది మందికి కరోనా వైరస్ సోకింది.  

సిద్దిపేట కలెక్టరేట్ : సిద్దిపేట జిల్లాలో బుధవారం మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా కొవిడ్ -19 నోడల్ అధికారి పవన్ తెలిపారు. వీటిలో సిద్దిపేట అర్బన్ ఏరియాలో 3, నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొందిలో ఒకటి, తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ ఒకటి కరోనా కేసులు  నమోదయ్యాయని పేర్కొన్నారు.

ఏటిగడ్డ కిష్టాపూర్ ఒకరికి... 

తొగుట : మండలంలోని ఏటిగడ్డ కిష్టాపూర్ వ్యక్తి(38) కరోరా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజులుగా అనారోగ్యం బాధపడుతున్న సదరు వ్యక్తిని ఈనెల 29న హైదరాబాద్ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఉస్మానియా దవాఖానకు తరలించి రక్త పరీక్షలు చేయగా బుధవారం పాజిటివ్ నిర్ధారణ కావడంతో గాంధీ దవాఖానకు తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో  56 మంది సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. వీరంతా హోం క్వారంటైన్ ఉండాలని డాక్టర్ వెంటటేశ్ తెలిపారు. గ్రామంలో వైద్య సిబ్బందితోపాటు   సర్పంచ్ దామరంచ ప్రతాప్ సూపర్ స్వామి, ఏఎన్ ఆశ వర్కర్లు, పోలీసులు ఇంటింటి సర్వే చేశారు.

గోవర్ధనగిరి, చౌటపల్లిలో కరోనాపై అవగాహన 

అక్కన్నపేట : మండలంలోని అంతకపేటకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో బుధవారం మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వైద్య బృందాలు  గోవర్ధనగిరి, చౌటపల్లి గ్రామాల్లో సర్వే చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా పాజిటివ్ వచ్చిన సదరు వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారి రక్త నమునాలను సేకరించి హోం క్వారంటైన్ ఉండాలని సూచించారు. వైద్య సిబ్బందితోపాటు సర్పంచ్ వైద్య సిబ్బంది ప్రేమలత, కొమురయ్య తదితరులు ఉన్నారు. 

నాగల్ మండలంలో ఇద్దరికి కరోనా 

నాగల్ : మండలంలోని ఔదత్ గ్రామానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యురాలు ఉషారాణి తెలిపారు. వారం రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో అనుమానించి వైద్య సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో వారిని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించి రక్త పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. బుధవారం గ్రామంలో మండల వైద్య సిబ్బంది, పోలీసులు ఇంటింటికి తిరిగి కరోనా లక్షణాలు ఉన్నవారి వివరాలను ఆరా తీశారు.

సంగారెడ్డి జిల్లాలో నలుగురికి కరోనా 

సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలో కొత్తగా బుధవారం నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మోజీరాం రాథోడ్ తెలిపారు. సంగారెడ్డి శాంతినగర్ ఒకరికి,   బీరంగూడలో మహిళకు, జహీరాబాద్ ఓ వ్యక్తికి, బొల్లారంలో మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు తెలిపారు. వీరిని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించినట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా దవాఖానలో కరోనా లక్షణాలతో వచ్చిన 81 మందికి రక్త  పరీక్షలు చేసినట్లు జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. 

బొల్లారంలో మరో కేసు  

బొల్లారం : బొల్లారం మున్సిపల్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్రాథమిక ఆరోగ్య అధికారి రాధిక బుధవారం తెలిపారు. సదరు వ్యక్తి జూన్ 29న గుండె సంబంధిత వ్యాధితో నగరంలోని కిమ్స్ దవాఖానకు వెళ్లగా వైద్యులు అనుమానించి రక్త పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. కుటుంబ సభ్యుల రక్త నమునాలను సేకరించి పరీక్షలు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

17 మందికి ముగిసిన హోం క్వారంటైన్

చేర్యాల : కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో గుర్తించిన 29 మందిలో 17 మందికి బుధవారం హోం క్వారంటైన్ ముగిసిందని హెల్త్ సెంటర్ సిబ్బంది మురళి తెలిపారు. 

మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో...

పెద్దశంకరంపేట : మండలంలోని ఉత్తులూర్ గ్రామ శివారులోని ఓరైస్ 14 మంది వలస కార్మికులను హోం క్వారంటైన్ చేసినట్లు వైద్యాధికారి పుష్పలత బుధవారం తెలిపారు. బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన వీరికి వైద్య పరీక్షలు చేయించామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వస్తున్నారని కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట సిబ్బంది విజయభాస్కర్, సాయిలు, భూమయ్య తదితరులు ఉన్నారు.


logo