గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 02, 2020 , 03:42:25

హారితహారంలో గజ్వేల్‌ ఆదర్శం

హారితహారంలో గజ్వేల్‌ ఆదర్శం

  • l అభివృద్ధిలో ప్రతి మండలం పోటీ పడాలి
  • l నెలాఖారులోపు నిర్మాణాలు పూర్తి కావాలి
  • l ఆగస్టు 10లోపు రైతు వేదికలు అందుబాటులోకి రావాలి
  • l మంత్రి హరీశ్‌రావు
  • l గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటన

గజ్వేల్‌/గజ్వేల్‌ టౌన్‌/ములుగు/వర్గల్‌ : హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి సంరక్షిస్తూ రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం ములుగు మండల పరిధి జప్తిసింగాయపల్లి, క్షీరసాగర్‌ గ్రామాల్లో భాగంగా మొక్కలు నాటారు. క్షీరసాగర్‌లో రూ. 6లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న పల్లె ప్రకృతి వనం, రూ.15లక్షల వ్యయంతో నిర్మించనున్న కూరగాయల మార్కెట్‌కు ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. గజ్వేల్‌ ఐవోసీ కార్యాలయంలో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గస్థాయి సమీక్ష నిర్వహించారు. గజ్వేల్‌లో రాజీవ్‌ పార్క్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ములుగు రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్గల్‌ మండల పరిధి మజీద్‌పల్లిలో రైతువేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, కరకలమ్మదేవాలయం వద్ద మొక్కలు నాటారు. ఆయా చోట్ల మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు జిల్లాలో అధికంగా మొక్కలు నాటి మొదటిస్థానంలో నిలుపాలని సూచించారు. ములుగు మండలంలో ఇప్పటికే 16 డంపింగ్‌ యార్డులు పూర్తి చేసినందుకు ఎంపీడీవోను మంత్రి అభినందించారు. గజ్వేల్‌ రాజీవ్‌పార్క్‌ అభివృద్ధికి ఇప్పటికే రూ.1.25కోట్లు మంజూరయ్యాయన్నారు. యూజీసీ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మంత్రి వెంట డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ బట్టు అంజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు జహంగీర్‌, రైతుబంధు సమితి జిల్లా  చైర్మన్‌ వంగా నాగిరెడ్డి, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జడ్పీకోఆప్షన్‌ సభ్యుడు సలీం, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ముజమ్మీల్‌ఖాన్‌, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకుడు జుబేర్‌పాషా, ఎంపీపీ పెద్దబాల్‌ లావణ్య అంజన్‌గౌడ్‌, జడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్‌గౌడ్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కుక్కల నరేశ్‌గౌడ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.

అభివృద్ధిలో పోటీ పడాలి..

హరితహారంలో ఇప్పటికే గజ్వేల్‌ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని గజ్వేల్‌ ఐవోసీలో జరిగిన సమీక్షలో మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్‌ గౌరవాన్ని నిలబెట్టేలా.. ప్రతీ మండలం అభివృద్ధిలో పోటీ పడాలని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రతీ మండలం మరో మండలంతో అభివృద్ధిలో పోటీ పడి అగ్రభాగాన నిలవాలని, ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలని మంత్రి కోరారు. 

యుద్ధప్రాతిపదికన పనులు చేయాలి

జూలై 31వ తేదీలోపు డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, ఆగస్టు 10వ తేదీలోపు రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. వర్గల్‌ మండలంలో 27గ్రామాలకు కేవలం 5 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు నిర్మించారని, మండలంపై స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. మండలంలో క్లస్టర్ల వారీగా రైతు వేదిక నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. మర్కూక్‌ మండలంలోని 16 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులను వినియోగంలోకి తెచ్చినందుకు ఎంపీడీవో కౌసల్యను మంత్రి అభినందించారు. తూప్రాన్‌, మర్కూక్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణాలను పూర్తి చేసి, ఎర్రలు వేసి వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నామని మండల అధికారులు మంత్రికి తెలుపగా, ఇరు మండలాల ఎంపీడీవోలు చాలా అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. గజ్వేల్‌ ఏరియా ప్రభుత్వ దవాఖానకు 10 పడకల ఐసీయూ కేంద్రం, 5 యూనిట్లు కలిగిన డయాలసిస్‌ కేంద్రం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయని, తొందరలోనే నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

రైతుబంధు డబ్బులు వచ్చాయా...

గజ్వేల్‌ రూరల్‌ : అందరికీ ఈ యేడు రైతుబంధు డబ్బులు వచ్చాయా.. బ్యాంకు ఖాతాలో చూసుకున్నారా.. అంటూ మంత్రి దాచారం గ్రామ మహిళలతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.  


logo