బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 28, 2020 , 23:16:58

పల్లెపల్లెన ప్రకృతి వనాలు

పల్లెపల్లెన ప్రకృతి వనాలు

సిద్దిపేట కలెక్టరేట్‌ : ‘హరితహారంలో భాగంగా ప్రతి పల్లెలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి... జూలై నెలాఖరులోగా అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, గ్రేవ్‌ యార్డులు, రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలి’... అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. ఆదివారం సుడా కార్యాలయంలో సిద్దిపేట అర్బన్‌, రూరల్‌, నారాయణరావుపేట మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఏఈవోలు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ జూలై 15వ తేదీలోపు నారాయణరావుపేట మండలంలోని 10 గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు. గ్రామాల వారీగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, కమ్యూనిటీ భవనాలు, తాగునీటి సరఫరా, హరితహారం, పశువుల షెడ్లు, కల్లాలను నిర్మించాలన్నారు. ఎరువులు, విత్తనాలు వచ్చాయా.. అంటూ మంత్రి ఆరా తీశారు. ఈ సంవత్సరం ఎన్ని మొక్కలు నాటాలి.. ఇప్పటి వరకు ఎన్ని గుంతలు తీశారని అడిగి తెలుసుకున్నారు. ఎన్సాన్‌పల్లిలో రూ.5 కోట్లతో చేపల చెరువు నిర్మించడంపై ఆ గ్రామ ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. మల్బరీ సాగుకు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, నారాయణరావుపేట ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, సిద్దిపేట రూరల్‌ మండల జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌, ఎంపీడీవోలు మురళీధర్‌శర్మ, సమ్మిరెడ్డి  పాల్గొన్నారు. 

కోమటిచెరువు సుందరీకరణ పనుల పరిశీలన 

సిద్దిపేట అర్బన్‌ : సిద్దిపేట కోమటిచెరువు సుందరీకరణ పనులు, నెక్లెస్‌రోడ్డు అభివృద్ధి పనులను ఆదివారం మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. మూడు రీచ్‌లలో చేపట్టిన నెక్లెస్‌రోడ్డు సుందరీకరణ పనులను పూర్తి చేసి, బతుకమ్మ పండుగలోపు అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టర్‌, మున్సిపల్‌ డీఈ లక్ష్మణ్‌లను ఆదేశించారు. అనంతరం కోమటి చెరువు కట్టపై మంత్రి కలియ తిరిగారు. మంత్రి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిఫల్‌ ఈఈలు వీరప్రతాప్‌, డీఈ లక్ష్మణ్‌, ఏఈ మహేశ్‌ ఉన్నారు.


logo