శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 28, 2020 , 23:15:06

విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు

విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు

సిద్దిపేట కలెక్టరేట్‌ : విద్యుత్‌ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన ట్రాన్స్‌కో డీఈ కార్యాలయాన్ని ఆదివారం ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు కరెంట్‌ సమస్య వేధించేదని, నేడు 24 గంటల కరెంట్‌ అందిస్తున్నామన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, గృహ వినియోగానికి నిరంతర కరెంట్‌ అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. సిద్దిపేట ప్రధాన జంక్షన్‌గా మారిందని, మూడు 440 కేవీ సబ్‌స్టేషన్లు వచ్చాయన్నారు. జిల్లాలో అంతగిరి, కొండపోచమ్మ, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్లతో సిద్దిపేట కేంద్రం పెద్ద జంక్షన్‌గా మారిందన్నారు. రానున్న రోజుల్లో ట్రాన్స్‌కో సూపర్‌విజన్‌ అవసరం ఉన్న దృష్ట్యా 220 కేవీ సిద్దిపేట నుంచి, 440 కేవీ కొడకండ్ల నుంచి... సెకండ్‌ కనెక్షన్‌ కోసం రూ.40 కోట్లతో చేపట్టిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కరీంనగర్‌ జిల్లా దుడిశెడు 440 కేవీ నుంచి సిద్దిపేటకు కనెక్షన్‌ ఉందని, ఏదైనా గాలిదూమారం వచ్చి ఇబ్బందులు ఏర్పడితే కొడకండ్ల నుంచి నిరంతరంగా విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొడకండ్ల 440 కేవీ నుంచి సిద్దిపేటకు ప్రత్యామ్నాయ విద్యుత్‌ సరఫరాకు కావాల్సిన పనులన్నీ పూర్తయ్యాయన్నారు. ఫారెస్టు లైన్‌లో పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, అటవీ ప్రాంతంలో 3 టవర్ల నిర్మాణం పూర్తయితే కొడకండ్ల నుంచి సిద్దిపేట కేంద్రానికి విద్యుత్‌ సరఫరా కానున్నదన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. 

కవుల పూదోట సిద్దిపేట..

సిద్దిపేట కవులు, రచయితలకు పూదోట అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తన నివాసంలో రచయిత ఉండ్రాల రాజేశం, బస్వరాజ్‌కుమార్‌లు రాసిన బంధుప్రీతి, చింతచెట్టు, చిర్రగోనె పుస్తకాలను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. ఎంతో మంది కవులు, కళాకారులు, రచయితలకు సిద్దిపేట పెట్టింది పేరన్నారు. రాజేశం రాసిన బంధుప్రీతి పుస్తకం బంధువుల మధ్య ఆప్యాయత, ఆత్మీయతను తెలుపుతుందన్నారు. రాజ్‌కుమార్‌ రాసిన చింతచెట్టు, చిర్రగోనె అనే బాలగేయం నాడు మన తరం ఆడిన ఆటలను గుర్తు చేసేలా ఉందన్నారు.  అనంతరం జిల్లా యోగా అసొసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఆరోగ్య ప్రపంచం పై యోగా వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  యోగా అసొసియేషన్‌ వారిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో యోగా అసొసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు కె.అం జయ్య, అధ్యక్షుడు అశోక్‌, సభ్యులు చిప్ప ప్రభాకర్‌, సతీష్‌, విక్రమ్‌రెడ్డి, రామ్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

మొక్కలు నాటి సంరక్షించాలి..

హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఏసీపీ రామేశ్వర్‌లతో కలిసి రంగధాంపల్లి శివారులోని వీమార్ట్‌ వద్ద 106 మొక్కలు నాటారు. సిద్దిపేట టూటౌన్‌ ఆవరణలో 500 మొక్కలు నాటారు. కాళ్లకుంట కాలనీలోనూ మొక్కలు నాటారు. టూటౌన్‌ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు నాటాలని ఆ ప్రాంతంలో మియావాకీ ఏర్పాటు చేసేలా డీఎప్‌వో సహకారం తీసుకోవాలని పోలీసులకు సూచించారు. మంత్రి వెంట డీఈ లక్ష్మణ్‌, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ఉమారాణి ఐలయ్య, సుడా డైరెక్టర్‌ ముత్యాల కనకయ్య ఉన్నారు.  

నష్టపరిహారం చెక్కులు అందజేత.. 

నంగునూరు మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఇండ్లు కూలిపోయిన 28 మందికి రూ.లక్షా 70 వేల  నష్టపరిహారం చెక్కులను మంత్రి సిద్దిపేటలో పంపిణీ చేశారు. పిడుగుపాటుకు గురై గేదెలు మృతి చెందడంతో రూ.90 వేల నష్టపరిహారం చెక్కులను అందజేశామన్నారు. 25 కుటుంబాలకు రూ.80 వేల నష్టపరిహారం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సోంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  


logo