శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 25, 2020 , 23:42:52

రాష్ట్రంలోనే సిద్దిపేట ఆదర్శ జిల్లా కావాలి

 రాష్ట్రంలోనే సిద్దిపేట ఆదర్శ జిల్లా కావాలి

చిన్నకోడూరు :  ‘హరితహారం’లో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. గురువారం మండల కేంద్రమైన చిన్నకోడూరులో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి జడ్పీ చైర్‌పర్సన్‌ మొక్కలు నాటి ఆరోవిడుత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిద్దిపేటలో 1996 నుంచి ‘హరితహారం’ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి ఒక్కో కుటుంబానికి 6 మొక్కలు పంపిణీ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజాప్రతి నిధులు, అధికారులు, ప్రజలందరూ ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు.  

విధుల్లో లేకపోతే శాశ్వతంగా తొలిగిస్తాం.. : కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మూడు రోజుల పాటు విధులకు హాజరు కాకపోతే వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలిగిస్తామని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి స్పష్టం చేశారు. చిన్నకోడూరు హరితహారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్‌లతో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి రోజు గ్రామాల్లో 8 గంటల పాటు విధులు నిర్వర్తించాలన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు.  కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సురేశ్‌బాబు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ పాపయ్య, సొసైటీ చైర్మన్లు సదానందంగౌడ్‌, కనకరాజు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఉమేశ్‌చంద్ర, శ్రీనివాస్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ శారద రమేశ్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ సాదక్‌ తదితరులు పాల్గొన్నారు. 

నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి ..

గజ్వేల్‌ రూరల్‌ :  హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే ప్రతి మొక్కను బతికించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని రిమ్మనగూడ - బూరుగుపల్లి గ్రామాల మధ్య ఎవెన్యూ ప్లాంటేషన్‌ను జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో ప్రతిపల్లెలో వేలాది మొక్కలను నాటే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం అహ్మదీపూర్‌లో ఏఎంసీ చైర్‌ పర్సన్‌ అన్నపూర్ణ శ్రీనివాస్‌, సర్పంచ్‌ నవీన, సింగాటంలో ఎంపీపీ అమరావతి, మండలాధ్యక్షుడు మధు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అన్నపూర్ణ శ్రీనివాస్‌, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, గ్రామ సర్పంచ్‌ విజయవర్థన్‌రెడ్డి, గడ ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఎంపీడీవో దామోదర్‌రెడ్డి తదిరుతులు పాల్గొన్నారు.


logo