శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 25, 2020 , 02:18:31

గోదారమ్మ జల సవ్వడి

గోదారమ్మ జల సవ్వడి

గజ్వేల్‌/గజ్వేల్‌ అర్బన్‌/మర్కూక్‌: గజ్వేల్‌, ఆలేరు నియోజకవర్గాల కాలువల్లో గోదారమ్మ జల సవ్వడి చేసింది. కొండపోచమ్మ సాగర్‌ నుంచి కాలువల్లోకి గోదావరి జలాల విడుదల బుధవారం అట్టహాసంగా జరిగింది. సీఎం కేసీఆర్‌ సూచనల  మేరకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి కొండపోచమ్మ రిజర్వా యర్‌ నుంచి ఎడమ కాలువ ద్వారా జగదేవ్‌పూర్‌, తుర్కపల్లి కాలువల్లోకి నీటిని వదిలారు. అంతకు ముందు పూజలు చేసి, స్విచ్‌ ఆన్‌ చేసిన వెంటనే ప్రజాప్రతినిధులంతా కిందికి వచ్చి కాలువలోని గోదావరి జలాలపై పసుపు, కుంకుమ చల్లి పువ్వులు సమర్పించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని శివారు వెంకటాపూర్‌ వద్ద ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తుర్కపల్లి కాలువకు ప్ర త్యేక పూజలు చేసి నీటిని విడుదల చే శారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మరో తూం నుంచి జగదేవ్‌పూర్‌ కాలువకు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. రెండువైపులా పూలుచల్లి పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. గేట్లు ఎత్తగానే కాలువలోకి ఒక్కసారిగా నీరు రావడం చూసి ప్రజాప్రతినిధులు, రైతులంతా ‘జై తెలంగాణ, జై కేసీఆర్‌' అంటూ నినాదాలు చేశా రు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు, బతుకమ్మలతో రిజర్వాయర్‌ వద్ద కు తరలిరావడంతో పండుగ వాతావరణం తలపించింది. ఈ దృశ్యాన్ని వీక్షించడానికి ఉదయం నుంచే కొండపోచమ్మ రిజర్వాయర్‌కు ప్రజాప్రతినిధులు, రైతులు తరలివచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి, కరోనా జాగ్రత్తలు పాటించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్‌, హౌసింగ్‌ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరె డ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ అన్నపూర్ణ శ్రీనివాస్‌, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, నాయకులు యాదవరెడ్డి, ఎంపీపీలు అమరావతి, పాండు గౌడ్‌, జడ్పీటీసీలు మంగమ్మ, సుధాకర్‌రెడ్డి, మల్లేశం, జయమ్మ అర్జున్‌గౌడ్‌, యాదాద్రి జడ్పీ వైస్‌చైర్మన్‌ బిక్కు నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


logo