బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 24, 2020 , 01:15:10

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌

l కంటైన్మెంట్‌ జోన్‌లో గజ్వేల్‌ పట్టణంలోని భరత్‌నగర్‌

l చికిత్స అనంతరం సంగారెడ్డి జిల్లా బొల్లారంవాసికి నెగెటివ్‌

l స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్న మెదక్‌ జిల్లాలోని టేక్మాల్‌వాసులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాను కరోనా భూతం వెంటాడుతున్నది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకపోతే ఏ వైపు నుంచి కరోనా వైరస్‌ సోకుతుందో తెలియని పరిస్థితి. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో ఐదు కరోనా కేసులు నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా, టేక్మాల్‌లో ఇటీవల కరోనా వైరస్‌ సోకి మృతి చెందగా, గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

సంగారెడ్డి మున్సిపాలిటీ : సంగారెడ్డి జిల్లాలోని బీడీఎల్‌లో ఒకరికి, అమీన్‌పూర్‌లో ఒకరికి, ఆర్సీపురంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ తెలిపారు. మంగళవారం అనారోగ్యానికి గురైన 27 మంది జిల్లా కేంద్ర దవాఖానకు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి వచ్చినట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి తెలిపారు. 

కోహీర్‌లో ఒకరికి..

కోహీర్‌ : కోహీర్‌ పోస్టాఫీస్‌ సమీపంలో ఉండే ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మండల వైద్యాధికారి రాజ్‌కుమార్‌ వైద్యసిబ్బందితోపాటు ఎస్సై రాముతో కలిసి గ్రామంలో పర్యటించారు. 15 మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించి, ఇంటింటి సర్వే చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిన సదరు వ్యక్తి ఓ దవాఖానలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించినట్లు వైద్యాధికారి వివరించారు.    

జీర్లపల్లిలో.. 

ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి(34)కి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు హైదరాబాద్‌ గాంధీ దవాఖాన వైద్యాధికారులు నిర్ధారించారు. తహసీల్దార్‌ తారాసింగ్‌, డాక్టర్‌ మజీద్‌, ఎస్సై ఏడుకొండలు గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు థర్మల్‌స్క్రీనింగ్‌ చేశారు. సన్నిహితంగా తిరిగినవారి వివరాలను సేకరించి, 14 మందికి జహీరాబాద్‌ ప్రభుత్వ దవాఖానలో నేడు ప్రైమరీ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.   

జోగిపేటలోనూ ఒకరికి.. 

వట్‌పల్లి : జోగిపేటలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తాలెల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ సంధ్యారాణి తెలిపారు. సదరు వ్యక్తితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించినట్లు పేర్కొన్నారు. జోగిపేటలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని మున్సిపల్‌ సిబ్బంది పిచికారీ చేశారు. 

మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో...

పెద్దశంకరంపేట : మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట పట్టణంలోని ఇందిరాకాలనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది మంగళవారం తెలిపారు. ఇదివరకు ఒక వ్యక్తికి కరోనా రాగా మరో వ్యక్తి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తి హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. కుటుంబీకులతోపాటు మరో ఎనిమిది మందిని హోం క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు.  logo