శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 24, 2020 , 01:15:07

రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం

రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం

  •  జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ

నంగునూరు  : నియంత్రిత సాగు విధానంలో  రైతులు ఆర్థికంగా ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ అన్నారు. నంగునూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఎంపీపీ అరుణాదేవి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబుకు నివాళులర్పించి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ మాట్లాడుతూ.. రైతుల సమస్యల పరిష్కారానికి నిర్మించే రైతు వేదికలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతరం నియంత్రిత సాగు, కరోనా పట్ల అప్రమత్తత, మండలానికి గోదావరి నీళ్లు చేరడంపై సభలో ఏకగ్రీవ తీర్మా నం చేశారు. వానకాలం సీజన్‌కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, నియంత్రిత పంట సాగు చేయాలని రైతులకు అన్ని గ్రామాల్లో అవగాహన కల్పించామని ఏవో గీత వివరించారు.  వైద్యురాలు రాధిక మాట్లాడుతూ అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సర్వ సభ్య సమావేశానికి పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు గైర్హాజరు కావడంపై  సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ  ఉమ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సోమిరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కృష్ణారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు , ఎంపీడీవో, తహసీల్దార్‌, సర్పంచ్‌లు ఉన్నారు.


logo