శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 24, 2020 , 00:59:07

పచ్చదనమే పరిరక్షణగా..

పచ్చదనమే పరిరక్షణగా..

రాయపోల్‌ : ఆరో విడుత హరితహారానికి రాయపోల్‌ మండలంలోని అన్ని నర్సరీల్లో మొక్కలు సిద్ధ్దంగా ఉన్నాయి. మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో 5వేల నుంచి 10వేల మొక్కలను పెంచుతున్నారు. ప్రభుత్వం గడిచిన ఐదు విడుతల్లో హరితహారం కింద నాటిన మొక్కలతో మండలంలోని పల్లెలో పచ్చదనం సంతరించుకుంది. ఒక్కో నర్సరీలో 5 వేల మొక్కలను పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఉపాధిహామీ నర్సరీల్లో 100 శాతం మొక్కలను పెంచేందుకు ఉపాధి పథకం అధికారులు ముందస్తుగా నర్సరీలకు షెడ్‌నెట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాయపోల్‌ మండలంలో ఉన్న నర్సరీలను ఉపాధి పథకం ఉన్నత అధికారులు పరిశీలించి మొక్కల పెంపకంపై నర్సరీల నిర్వాహకులకు సూచనలు చేశారు. ఆసక్తి ఉన్న రైతులకు వారి పంట పొలాల వద్ద పెంచుకునేందుకు ఉచితంగా ఉపాధిహామీ పథకం ద్వారా గుంతలు తీయడంతో పాటు మొక్కలను అందించనున్నారు. గ్రామాల్లో రోడ్లకు ఇరుపక్కలా, గ్రామపంచాయతీ భవనాల వద్ద, పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాలు, తదితర చోట్ల మొక్కలను నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.  

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అడవులను 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఏటా వానకాలం ప్రారంభంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇప్పటికే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఐదు విడుతలుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారి పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ నెల 25 నుంచి ఆరో విడుత ప్రారంభం కానుండడంతో అధికారులు మొక్కలు నాటేందుకు గుంతలు తీయించి పెట్టారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తున్నారు.

- ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌

హరితహారాన్ని విజయవంతం చేస్తాం ..

ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.     సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, యువజన, మహిళా సంఘాలు సహకరించాలి. అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాం. నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయి.

- స్వర్ణకుమారి, ఎంపీడీవో  రాయపోల్‌logo