మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 23, 2020 , 00:15:51

‘క్రమబద్ధీకరణ’కు సువర్ణావకాశం

‘క్రమబద్ధీకరణ’కు  సువర్ణావకాశం

పురపాలక సంఘాల్లో అనుమతి లేని స్థలాలను, లే ఔట్లను క్రమబద్ధీకరించుకునేందుకు తెలంగాణ సర్కారు మరో అవకాశం కల్పించింది. ‘ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం’ పేరిట అక్రమ వెంచర్లలో కొనుగోలు చేసిన వారికి ఇదో సువర్ణావకాశం. గతంలో ప్రభుత్వం జనవరి 1, 2020 వరకు స్థలాలు క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా సమకూరిన ఆదాయాన్ని సగానికి పైగా అదే ప్రాంతంలో ఖర్చు చేయాలనే నిబంధన ఉండడంతో ఆయా వెంచర్లకు మహర్దశ రానున్నది. ప్లాట్ల క్రమబద్ధీకరణతో మున్సిపాలిటీలకు ఆదాయం చేకూరడంతోపాటు ఇంటి స్థలాల ధరలకూ రెక్కలు రానున్నాయి. కాగా ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం జిల్లాలోని చేర్యాల, గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక తదితర మున్సిపాలిటీల ప్రజలకు ఎంతో మేలు కలిగించనున్నది.  -చేర్యాల

అనుమతి లేని లేఔట్లల్లో 2018 మార్చి 30లోపు ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ప్లాట్లు, సేల్‌ డీడ్‌ అయిన భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌లో అవకాశం ఉన్నది. మున్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తులను అధికారులు అన్ని సిద్ధం చేశారు. ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలనుకునే వారు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ lrsdtcptelangan agov.in  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల మేరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు వెంటనే క్రమబద్ధీకరిస్తారు. దరఖాస్తు చేసుకునే వారికి బెటర్‌మెంట్‌, డెవలప్‌మెంట్‌ చార్జీలు లే-ఔట్‌ సెక్యూరిటీ, జరిమానాలు కలిపి ఫీజు విధిస్తారు. ఈ పథకం కింద దరఖాస్తుతో పాటు గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, లొకేషన్‌ ప్లాన్‌, సెక్యూరిటీ బాండ్‌, ఎన్‌వోసీ జతచేసి మున్సిపాలిటీలో అందజేయాల్సి ఉంటుంది. 

మార్కెట్‌ విలువ ప్రకారం ఫీజులు

 దస్తావేజులు పరిశీలించి క్రమబద్ధ్దీకరణకు అర్హమైనవని భావిస్తే సాధారణ క్రమబద్ధీకరణ ఫీజు కింద 100 చదరపు మీటర్లలోపు స్థలానికి చదరపు మీటరుకు రూ.200 చొప్పున, 101 నుంచి 300 మీటర్ల వాటికి రూ.400 చొప్పున, 301 నుంచి 500 మీటర్లలోపు వాటికి రూ.600 చొప్పున, 500 చదరపు మీటర్లకు పైగా ఉన్న భూములకు రూ.750 చొప్పున విధిస్తారు. మురికివాడల్లో  చదరపు మీటరుకు రూ.5 చొప్పున ఫీజు వసుల్‌ చేస్తారు. వీటితో పాటు క్రమబద్ధీకరణ చార్జీలను ఆయా ప్రాంతాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువ ప్రకారం నిర్ణయిస్తారు. చదరపు గజానికి రూ.3వేలలోపు ఉన్న వాటికి 20 శాతం చొప్పున, రూ.3001 నుంచి రూ.5వేల ఉన్న వాటికి 30 శాతం, రూ.5001 నుంచి రూ.10వేల లోపు ఉన్న వాటికి 40 శాతం, రూ.10,001 నుంచి రూ.20వేలలోపు ఉన్న వాటికి 50 శాతం, రూ.20,001 నుంచి రూ.30వేల లోపు వాటికి 60 శాతం, రూ.30,001 నుంచి రూ.50వేల లోపు ఉన్న వాటికి 80 శాతం, చదరపు గజానికి రూ.50వేలకు పైగా ఉన్న వాటికి వందశాతం ఫీజును వసూలు చేస్తారు.

 లాభాలు.. సౌలభ్యాలు 

అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవడం వల్ల దాని విలువ పెరుగడంతోపాటు ప్లాటు విక్రయించుకోవాలనుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  క్రమబద్ధీకరించుకున్న ప్లాట్లకు నిర్మాణ  అనుమతులు వెంటనే లభించడంతోపాటు బ్యాంకు రుణం పొందే సౌకర్యం ఉంటుంది. ప్లాట్లను క్రమబద్ధీకరించుకోకుంటే స్థలంలో హద్దులు తొలిగించి, నిర్మాణ అనుమతులు ఇవ్వరు. అనధికార లే-ఔట్లల్లో ప్రభుత్వం తరుఫున ఎలాంటి సౌకర్యాలు(రోడ్లు, మురుగు కాల్వలు, నీటి వసతి, వీధి దీపాలు) ఉండవు.

 ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి 

 టీఆర్‌ఎస్‌ సర్కారు అన్ని వర్గాలకు మేలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. అక్రమ లే ఔట్లల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు,  వెంటనే రెగ్యులరైజ్‌ చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకుంటేనే నిర్మాణ అనుమతులు వస్తాయి. అన్ని అనుమతులు ఉన్న వెంచర్లల్లో  రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర వసతులు మున్సిపాలిటీ కల్పిస్తుంది. ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను సద్వినియోగం చేసుకోవాలి. 

-అంకుగారి స్వరూపారాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌


logo