మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 22, 2020 , 01:03:13

అన్ని వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులు

అన్ని వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులు

  • జూలై మొదటి వారంలోగా ప్రారంభం కావాలి 
  • ఈనెల 25న రెండు లక్షల పైచిలుకు మొక్కలు నాటాలి 
  • తడి, పొడి, హానికర చెత్త విభజన జరిగేలా చూడాలి 
  • మున్సిపల్‌ చైర్మన్‌, అధికారులు, సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు ఆదేశం 
  • హైదరాబాద్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి 

సిద్దిపేట కలెక్టరేట్‌: పట్టణంలోని అన్ని వార్డుల్లో జూలై మొదటి వారంలోగా స్టీల్‌ బ్యాంకులు ప్రారంభం కావాలి.. ఈనెల 25న హరితహారంలో 2 లక్షల పైచిలుకు మొక్కలు నాటాలి.. తడి, పొడి, హానికర చెత్త విభజన జరిగేలా చూడాలి.. ప్లాస్టిక్‌ రహితంగా పరిశుభ్రమైన పచ్చదనంగా సిద్దిపేటను తీర్చిదిద్దుదామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ శాంతి, బాల వికాస ప్రతినిధి శౌరిరెడ్డి, మున్సిపల్‌ మెప్మా ఆర్పీలు, సిబ్బందితో స్టీల్‌ బ్యాంకుల ఏర్పాటు, హరితహారం, తడి,పొడి, హానికర చెత్త విభజనపై హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మంత్రి హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలో 34 వార్డులకు గాను ఇప్పటికే 5 వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులు ప్రారంభించుకున్నామని, మిగతా 29 వార్డుల్లో స్టీల్‌ బ్యాంకుల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌, ఆర్పీలు ఎంపిక చేసి సిద్ధం చేయాలని సూచించారు. స్టీల్‌ బ్యాంకు ద్వారా 700 మంది భోజనం చేసేలా అన్నిరకాల సామగ్రి ఉంటాయని.. ప్లాస్టిక్‌ ప్లేట్లు తదితర వస్తువుల వినియోగం కంటే స్టీల్‌ బ్యాంకులో వస్తువుల ధర తక్కువ ఉంటాయని అవగాహన కల్పించాలని మెప్మా ఆర్పీలకు సూచించారు. ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసుల వినియోగం పెరిగిందని, వాటికి ప్రత్యామ్నాయంగా స్టీల్‌ బ్యాంకులను ఏర్పాటు చేసుకుందామన్నారు. స్టీల్‌ బ్యాంకుల నిర్వాహణకు ఆర్పీలకు విడుతల వారిగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈనెల 25న ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ పరిధిలో 2లక్షల పైచిలుకు మొక్కలు నాటే లక్ష్యం ఉందని, ఇందుకు గాను పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని చైర్మన్‌, కమిషనర్‌, ఆర్పీలకు సూచించారు. 

10 వార్డుల్లో తడి, పొడి, హానికర చెత్త విభజన సరిగా నిర్వహించడం లేదని, ఆయా వార్డుల్లో ఆర్పీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రోజు చెత్త ఇవ్వని, చెత్త పడేసే ప్రదేశాలు, చెత్త పడేసిన వాసులను గుర్తించి జరిమానా విధించాలన్నారు. స్టీల్‌ బ్యాంకు వినియోగంతో ప్రజలకు ఆరోగ్యం చేకూరడంతో పాటు ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసుల ఖర్చు కంటే తక్కువగా ఉంటున్నట్లు ప్రజల నుంచి స్పందన వస్తుందని ఆర్పీలు మంత్రికి తెలిపారు. స్టీల్‌ బ్యాంకులో ధర తక్కువ ఆరోగ్యం బాగుంటుందని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆర్పీలకు సూచిస్తూ మంత్రి వారిని అభినందించారు. 


logo