శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 22, 2020 , 00:12:51

కరోనా కష్టకాలంలోనూ రైతుకు సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్‌

కరోనా కష్టకాలంలోనూ రైతుకు సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్‌

  • రైతుబంధు కింద వరుసగా ఐదో పంటకూ పెట్టుబడి సాయం
  • మొదట రెండు పంటలకు ఎకరాకు ఎనిమిది వేలు..
  • గత వానకాలం నుంచి వరుసగా మూడు పంటలకు పెరిగిన సాయం
  • ఎకరాకు రెండు పంటలకు గాకూ ఏటా రూ. 10 వేలు.. 
  • జాబితాను సిద్ధంచేసిన వ్యవసాయశాఖ 
  • వ్యవసాయశాఖ పోర్టల్‌లో ఉన్న ప్రతి రైతుకూ వర్తింపు
  • ఉమ్మడి జిల్లాలో 6,81,162 మంది రైతులకు సాయం 
  • కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు వచ్చిన 65,859 మందికీ వర్తింపు
  • వారం, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ  

పంట పెట్టుబడులకు రైతాంగం ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం కింద సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వానకాలానికి సంబంధించి వారం, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో నేరుగా పంట పెట్టుబడి సాయం జమచేయనున్నది. కరోనా-లాక్‌డౌన్‌తో ఆదాయం తగ్గి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ పంట పెట్టుబడి సాయం అందించేందుకు నిధులు విడుదల చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇప్పటికే 6,81,162 మంది రైతులు రైతుబంధు సాయం పొందుతుండగా, కొత్తగా పట్టాదారు పుస్తకాలు వచ్చిన 65,859 మందికి ఈ పథకం వర్తించనున్నది. అకౌంట్‌, ఆధార్‌కార్డు, ఇతర సమస్యలు, పూర్తి సమాచారం ఇవ్వని రైతుల వివరాలను అధికారులు సేకరించారు. వీరికి కూడా రైతుబంధు అందించేందుకు అధికారులు సర్వేచేసి జాబితాను రూపొందించారు. వీరి సంఖ్య మరో 30వేలు ఉంటుంది. అంతిమంగా ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా యంత్రాంగం కృషి చేస్తున్నది.

 - సిద్దిపేట, నమస్తే తెలంగాణ 

యావత్తు దేశం తెలంగాణ వైపు చూస్తుంది. ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా మన రాష్ట్ర సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం వానకాలం, యాసంగికి రెండు పంటలకు (పెట్టుబడి సాయం) రైతుబంధును అందిస్తున్నారు. త్వరలోనే నేరుగా రైతుల ఖాతాలోనే పెట్టుబడి డబ్బులు జమకానున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సుమారుగా 6,81,162 మంది రైతులు లబ్ధి పొందుతుండగా, కొత్తగా పట్టాదారు పుస్తకాలు వచ్చిన 65,859 మందికి ఈ పథకం వర్తిస్తుంది. అకౌంట్‌, ఆధార్‌కార్డు, ఇతర సమస్యలు, పూర్తి సమాచారం ఇవ్వని రైతుల వివరాలను సేకరించారు. వీరికి కూడా రైతుబంధు అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి జాబితాను రూపొందించారు. వీరంతా సుమారుగా మరో 30 వేల మంది వరకు ఉంటారు. అంతిమంగా ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యం. ఆ దిశగా అధికారయంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ వానకాలంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 13,99,337 ఎకరాలు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. కాగా, రైతులకు ప్రస్తుతం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం ఐదో విడుతది. ప్రభుత్వం మొదటి ఏడాది ఎకరాకు రెండు పంటలకు గాను 8వేలు అందివ్వగా, గత వానకాలం నుంచి ఎకరాకు రెండు పంటలకు రూ.10 వేలు అందిస్తున్నది. ప్రస్తుత వానకాలం పంటకు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో త్వరలో పడనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ... 

సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలోని రైతులకు పెట్టుబడి సాయం వారి ఖాతాల్లోనే జమచేసేందుకు ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2020 సంవత్సరం వానకాలం నుంచి నియంత్రిత పద్ధతిలో సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించగానే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు తమ మద్దతును తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి వ్యవసాయ శాఖ అధికారులకు అందించారు. నియంత్రిత పద్ధతిలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 13,99,337 ఎకరాలు సాగు కానున్నది. సిద్దిపేట జిల్లాలో 4,99,963 ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 2,60,560 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 6,38,814 ఎకరాల్లో వరి, పత్తి, కందులు తదితర పంటలను సాగు చేస్తున్నారు. ప్రతి రైతుకు రైతుబంధు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నాలుగైదు రోజుల్లోనే పంట పెట్టుబడి సాయం అందనున్నది. ఈ ఏడాది జనవరి మాసం వరకు కొత్తగా పాసు పుస్తకాలు వచ్చిన రైతులకు కూడా రైతుబంధు అందనున్నది. వ్యవసాయశాఖ పోర్టల్‌లో పేరున్న రైతులందరికీ రైతుబంధు సాయం అందుతుంది. కాగా, సిద్దిపేట జిల్లాలో నాలుగు విడుతలుగా 2,37,349 పట్టాదారులకు  రైతుబంధు పథకం డబ్బులను అందుతుండగా, కొత్త పట్టాదారు పుస్తకాలు వచ్చిన 19,821 మందితో పాటు వివిధ కారణాలతో సరియైన సమాచారం లేకుండా ఉన్న పాతవి 17,194 మంది కలుపుకొని మొత్తం 2,74,364 మంది పట్టేదారులకు రైతుబంధు అందుతుంది. మెదక్‌ జిల్లాలో 1,87,385 మంది రైతుబంధు పొందుతున్నారు. కొత్తగా పట్టాదారు పుస్తకాలు పొందిన వారు 17, 321 మంది ఉన్నారు. మొత్తం 2,04,706 మంది పట్టేదారులు, వీరితో పాటు పాతవి మరి కొంతమంది ఉంటారు. అలాగే, సంగారెడ్డి జిల్లాలో 2,56,426 మంది పట్టేదారులు, కొత్తగా 28,717 మంది పట్టేదారులు మొత్తం 2,85,145 మంది ఉన్నారు. ఇక్కడ వివిధ కారణాలతో సరియైన సమాచారం లేని మరి కొంతమంది రైతుల వివరాలను సేకరించారు. వారికి కూడా రైతుబంధును అందజేయనున్నారు. వీరందరికీ రంగారెడ్డి ట్రెజరీ నుంచి డబ్బులను రైతుల ఖాతాలో జమకానున్నాయి.

ఐదో విడుత పంట సాయం

రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుంది. మే 2018లో సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు గాను ఏడాదికి రూ.8 వేలను అందించారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలు రైతుల ఖాతాలోనే జమ చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుత వానకాలం పంటతో వరుసగా ఐదు పంటలకు రైతు బంధు అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కుతుంది. రైతుబంధు డబ్బులు త్వరలో పడుతుండడంతో ఉమ్మడి జిల్లా రైతులంతా హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  

క్లిష్ట పరిస్థితుల్లోనూ సాయం

కరోనాతో దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నపట్టికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్‌ పెట్టుబడిసాయం అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల అయ్యాయి. ఉమ్మడి జిల్లాకు సుమారుగా తొమ్మిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు అవసరం అవుతాయని అధికారిక లెక్కలు చెబుతుండగా, నాలుగైదు రోజుల్లోనే రంగారెడ్డి ట్రేజరి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఇప్పటికే రుణమాఫీ ప్రకియ ప్రారంభం అయింది. రూ.25 వేల లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం ఏకకాలంలో డబ్బులను మాఫీ చేస్తుంది. ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. మిగితా వాళ్లవి నాలుగు విడుతలుగా రుణమాఫీ కానుంది. వారికి త్వరలోనే తొలి విడుత డబ్బులు విడుదల కానున్నట్లు సమాచారం. 

నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ 

జిల్లాలోని రైతులకు రైతుబంధు డబ్బులు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలోనే జమ అవుతాయి. వ్యవసాయశాఖ క్లస్టర్ల వారీగా ఏఈవో, ఏవోలు పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి అప్‌లోడ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కొత్తగా పాస్‌ బుక్కులు వచ్చిన వారివి కూడా పంపడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో కొత్తగా పాసు బుక్కులు వచ్చిన 19,821 మందికి రైతుబంధు వస్తుంది. మొత్తం జిల్లాలో 2,74,364 మందికి వర్తింపు. అదేవిధంగా జిల్లాలో నియంత్రిత పద్ధతిలో సాగు పనులు కొనసాగుతున్నాయి. 

- శ్రవణ్‌కుమార్‌,  సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి


logo