శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 20, 2020 , 23:19:59

తగ్గని కరోనా కేసులు

తగ్గని కరోనా కేసులు

  • సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏడు.. 
  • మెదక్‌లో 57 మంది హోం క్వారంటైన్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శనివారం జిల్లాలోని ఆర్సీపురంలో పాజిటివ్‌ కేసు నమోదు కాగా, సంగారెడ్డిలోని చింతల్‌పల్లిలో రెండు కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.

భానూర్‌లో మరో నలుగురికి.. 

పటాన్‌చెరు: భానూర్‌లో తల్లి, ముగ్గురు బిడ్డలకు పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.   భానూర్‌  పరిధి బీడీఎల్‌ టౌన్‌షిప్‌కు మహిళా ఉద్యోగి చెన్నై నుంచి వచ్చిం ది. కూతురు వద్దకు వచ్చిన వృద్ధురాలు అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించగా, వృద్ధురాలికి పాజిటివ్‌ వచ్చింది.  

 కంటైన్‌మెంట్‌ జోన్‌లో రసాయనాల పిచికారీ

బొల్లారం: మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో మున్సిపల్‌ అధికారులు 4వ వార్డు, 15వ వార్డులను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. కార్మిక నాయకుడు వరప్రసాద్‌రెడ్డి వార్డులో పర్యటించి మున్సిపల్‌ కార్మికులతో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

మృతి చెందిన పాపకు కరోనా పాజిటివ్‌

హత్నూర: మూడునెలల పాప కరోనా లక్షణాలతో మృతి చెందింది. మంగాపూర్‌ గ్రామానికి చెందిన మూడు నెలల పాప ఈ నెల 14న అనారోగ్యానికి గురికావడంతో కుటుంబీకులు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. జ్వరం తగ్గకపోవడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు నిలోఫర్‌కు తరలించగా 17న మృతిచెందింది. అదేరోజు కుటుంబీకులు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, చికిత్స సమయంలో పాప రక్తనమూనాలను పరీక్షలు జరుపగా శనివారం పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు చెప్పారు. దీంతో తహసీల్దార్‌ జయరాంతోపాటు వైద్యసిబ్బంది గ్రామానికి చేరుకొని కుటుంబీకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.  

 24 మందికి హోం క్వారంటైన్‌

పెద్దశంకరంపేట: మండలంలో శనివారం 24 మందికి హోం క్వారంటైన్‌ చేసినట్లు తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి తెలిపారు. సప్తగిరి రైస్‌మిల్‌లో బీహార్‌కు చెందిన హమాలీలు 24 మంది రావడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి స్టాంప్‌లు వేసి హోం క్వారంటైన్‌ చేశామన్నారు. పట్టణంలో ఇటీవల ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా, అతడి కాంటాక్ట్‌లో ఉన్న 39 మందిని ఇప్పటికే హోం క్వారంటైన్‌ చేశారన్నారు.

తూప్రాన్‌లో భారీకేడ్ల ఏర్పాటు   

తూప్రాన్‌ రూరల్‌ : కరోనా దృష్ట్యా పట్టణంలో పోలీసు, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు శనివారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన వ్యక్తి కాలనీలోకి ఎవ్వరూ రాకపోకలు సాగించకుండా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలోని రెవెన్యూ, ఎంపీడీవో, పంచాయతీరాజ్‌శాఖ కార్యాలయాల ఆధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పట్టణంలో లాక్‌డౌన్‌ కొనసాగింది.  

టేక్మాల్‌లో 33 మంది క్వారంన్‌టైన్‌

టేక్మాల్‌: కరోనా పాజిటివ్‌తో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటనలో 33 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. మృతిచెందిన వ్యక్తితో టేక్మాల్‌ గ్రామానికి చెందిన పలువురు మే 8వ తేదీన  కలిసినట్లుగా తెలిసింది. దీంతో వారి కుటుంబ సభ్యులతో కలిపి 33 మందిని హోం క్వారంన్‌టైన్‌లో ఉంచినట్లుగా అధికారులు వెల్లడించారు.   

చేర్యాలలో కరోనా కలకలం

చేర్యాల: చేర్యాలలో శనివారం కరోనా కలకలం సృష్టించింది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి వారం రోజులుగా జ్వరం తో పాటు దగ్గుతో బాధపడుతూ పట్టణంలో ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. వైద్యులు అతనికి చికిత్సలు చేయడంతో దగ్గు, జ్వరం తగ్గినప్పటికీ అలసట, నీరసం తదితర లక్షణాలు ఉండటంతో సదరు వ్యక్తిని కుటుం బీకులు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా, పాజిటివ్‌ వచ్చింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారు కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌రెడ్డి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మురళి కోరారు. ఇతర రాష్ర్టాల నుంచి చేర్యాల పట్టణానికి వచ్చిన వారికి శనివారం 4వ వార్డులో వైద్య సిబ్బంది ముద్రలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొరుగు రాష్ర్టాల వచ్చిన వారిలో 12మంది స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. ముంబై నుంచి వచ్చిన వారికి ముద్రలు వేశామని, 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు.

హోం క్వారంటైన్‌లో ఉండాలి

రాయపోల్‌ : కరోనా నేపథ్యంలో ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి వచ్చిన వారు 29 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని రాయపోల్‌ సీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీధర్‌ పేర్కొన్నారు. మండలంలోని సయ్యద్‌నగర్‌లో దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఇంటికెళ్లి స్క్రీనింగ్‌ చేశారు.

కరోనా సోకిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచాలి 

 సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి

సంగారెడ్డి టౌన్‌: కరోనా సోకిన వ్యక్తుల పేర్లు, వారి వివరాలు గోప్యంగా ఉంచాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా సోకిన వారి వివరాలు వాట్సప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సమాచార మాధ్యమాల్లో పెట్టినా, సమాచారం ఇతరులకు షేర్‌చేసిన సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.వాట్సాప్‌ గ్రూపుల్లో కరోనా సోకిన వ్యక్తుల సమాచారం ఎవరైనా ప్రసారం చేసిన, వాట్సాప్‌ గ్రూపు ల్లో పెడితో గ్రూప్‌ అడ్మిన్‌తో పాటు సంబంధిత వ్యక్తులపై చర్యలు తప్పవన్నారు. జిల్లా పోలీసుశాఖ సోషల్‌ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

విద్యుత్‌ అధికారికి కరోనా.. భార్యాభర్తలకు పాజిటివ్‌ నిర్ధారణ

గజ్వేల్‌: గజ్వేల్‌ మండలం కొడకండ్ల విద్యుత్‌ సబ్‌ స్టేషన్లో పని చేస్తున్న విద్యుత్‌ అధికారి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతనిని కలిసిన వారని గుర్తించి, శనివారం హోం క్వారంటైన్‌కు తరలించారు. స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఉద్యోగి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. భార్యతో పాటు తాను హైదరాబాద్‌లో శుక్రవారం కరోనా పరీక్షలకు నమూనాలు ఇచ్చి, విధులు నిర్వహించడానికి కొడకండ్లకు వచ్చాడు. భార్యకు పాజిటివ్‌ వచ్చినట్లు తెలియగా, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి హైదరాబాద్‌ తిరిగి వెళ్లాడు. ఆ తర్వాత సదరు ఉద్యోగికి కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో శుక్రవారం వరకు సదరు ఉద్యోగితో కలిసి పని చేసిన 11మందిని గుర్తించి హోం క్వారంటైన్‌కు పంపినట్లు డాక్టర్‌ కాశీనాథ్‌ తెలిపారు. గ్రామంలో శనివారం తగిన వైరస్‌ నివారణ చర్యలు చేపట్టినట్లు డాక్టర్‌ కాశీనాథ్‌తో పాటు స్థానిక గ్రామ కార్యదర్శి తెలిపారు.logo