మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 20, 2020 , 22:55:23

పది రోజుల్లో చింతమడకకు గోదావరి నీళ్లు

పది రోజుల్లో చింతమడకకు గోదావరి నీళ్లు

  • కాలంతో పని లేదు.. కాళేశ్వరంతోనే పని..
  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 
  • చింతమడకలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన
  • 133మంది లబ్ధిదారులకు  రూ.9కోట్ల 87వేల చెక్కుల అందజేత 

సిద్దిపేట రూరల్‌ : మరో రెండు రోజుల్లో చింతమడక, మధిర గ్రామాలు దమ్మచెరువు, అంకంపేటలోని పెద్దచెరువుకు.. మరో వారం, పది రోజుల్లో చింతమడక చెరువుకు కాళేశ్వరం జలాలు రానున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇక నుంచి మనకు కాలంతో పని లేదని, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే పని ఉంటదన్నారు. శనివారం సిద్దిపేట రూరల్‌ మండల పరిధి చింతమడక గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించే రైతు వేదిక భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ తన స్వగ్రామానికి ఇచ్చిన హామీ మేరకు 133మంది లబ్ధిదారులకు రూ.9కోట్ల87 వేల విలువ గల చెక్కులను  కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి అందజేశారు. చింతమడకతో పాటు మధిర గ్రామాలైన అంకంపేట, దమ్మచెరువు గ్రామ పునర్నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. గ్రామస్తులతో కొద్దిసేపు ముచ్చటించారు. మరో మూడు నెలల్లో కొత్త ఇండ్లకు పంపిస్తామని తెలిపారు. మరో వారం రోజుల్లో దమ్మచెరువు, అంకంపేట గ్రామాల చెరువులు నిండనున్నాయని తెలిపారు. చింతమడక గ్రామ శివారులోని మల్లన్నసాగర్‌ దుబ్బాక ప్రధాన కాలువను పరిశీలించారు. మల్లన్నసాగర్‌ దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా నిండనున్న చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇరిగేషన్‌ అధికారులను ఆరా తీశారు. ఆ తర్వాత ఇర్కో డు, తోర్నాల గ్రామాల్లోని కాలువల వద్ద జలహారతి పట్టి, గంగమ్మతల్లికి పుష్పాభిషేకం చేశారు. ఆయా చోట్ల మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. చింతమడక గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలపాలన్నది సీఎం కేసీఆర్‌ కల అన్నారు. సీఎం కేసీఆర్‌ స్వగ్రామానికి ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు 1270 మంది లబ్ధిదారులకు సాయం అందించారన్నారు. చింతమడకతో పాటు మధిర గ్రామాలైన సీతరాంపల్లి, మాచాపూర్‌ మూడు గ్రామాలకు కలుపుకుని మొత్తం 1580 యూ నిట్లు ఉండగా, ఇప్పటివరకు 1270 మందికి లబ్ధి చేకూరినట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చినందుకు లబ్ధిదారులకు భూములు కొనడంతో ప్రయోజనం ఉంటుందన్నారు. కరోనా నేపథ్యంలో కూలీలు దొరక్క పనులు ఆలస్యమయ్యాయని, ఇక నుంచి త్వరగా పూర్తయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. వారం రోజుల్లో రైతుబంధు సాయం ప్రతి రైతుకు అందుతున్నారు. త్వరలోనే పాడి పశువులు ఎంచుకున్న రైతులకు పంపిణీ చేస్తామన్నారు. గ్రామ శివాలయ పునర్నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు కలెక్టర్‌ వెంట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ చింతమడకను వ్యవసాయ, ఆర్థిక పరంగా ఆదర్శ గ్రామంగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్‌ కల అని, భూమి కొనుక్కునే లబ్ధిదారులకు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ ఖర్చులు భరిస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో చింతమడక గ్రామంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ వంగ నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌, ఎంపీపీ శ్రీదేవి చందర్‌రావు, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌, తహసీల్దార్‌ పరమేశ్వర్‌, ఎంపీడీవో సమ్మిరెడ్డి, సర్పంచ్‌ హంసకేతన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

హసన్‌మీరాపూర్‌ రైతులకు పట్టాలు

దుబ్బాక : మండలంలోని హసన్‌మీరాపూర్‌కు చెందిన 50 మంది రైతులకు శనివారం సాయంత్రం సిద్దిపేటలోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగృహంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రొసీడింగ్‌ పత్రాలు అందజేశారు. త్వరలోనే రైతులకు పట్టాపాసు పుస్తకాలు అందజేయాలని రెవెన్యూ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సుమారు 70ఏండ్ల కలను నెరవేర్చిన ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సోలిపేటకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

రైతు వేదికలు, కల్లాలు  రెండు నెలల్లో నిర్మించాలి

సిద్దిపేట కలెక్టరేట్‌: రైతు వేదికలు.. వ్యవసాయ కల్లాల నిర్మాణాలు రెండు నెలల్లోపు పూర్తి చేయాలని, రైతు వేదికల నిర్మాణాలకు నిధుల కొరత లేదని, ఇంజినీరింగ్‌, డీఆర్‌డీఏ, వ్యవసాయ అధికారులు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవన్‌, డీపీవో సురేశ్‌బాబు, పంచాయతీ రాజ్‌ శాఖ ఈఈ కనకరత్నం, ఆర్‌అండ్‌బీ ఈఈ సుదర్శన్‌, ఏజెన్సీ ప్రతినిధులతో రైతు వేదికలు, కల్లాల నిర్మాణాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ వాన కాలంలోపు రైతు వేదికల నిర్మాణాలు చేసి వినియోగంలోకి తేవాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రెండు నెలల్లోపు జిల్లాలో 126 రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపాలని, పూర్తిస్థాయిలో సహాయ సహకారులు అం దిస్తామని ఏజెన్సీలను మంత్రి కోరారు. ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షల చొప్పున రూ.15.19 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. రూ.12 లక్షల వ్యవసాయ, రూ.10 లక్షలు ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేస్తారన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 31, దుబ్బాక 28, గజ్వేల్‌ 30, హుస్నాబాద్‌ 17, జనగామ నియోజకవర్గలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లో 14, బెజ్జంకి మండలంలో 6 రైతు వేదికల నిర్మాణానికి ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కల్లాల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద సిద్దిపేట జిల్లాకు రూ.34.64 కోట్లు నిధులు సీఎం కేసీఆర్‌ మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 4805 కల్లాల నిర్మించనున్నట్లు చెప్పారు. కల్లాల నిర్మాణం వేగవంతంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని డీఆర్‌డీఏ పీడీని మంత్రి ఆదేశించారు. సమీక్షలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ డీఈ వేణు, ఏజెన్సీ ప్రతినిధులు బాపినీడు, చంద్రశేఖర్‌, మధు, గౌరీ, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo