మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 19, 2020 , 23:50:34

ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు

ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు

సిద్దిపేట రూరల్‌ : ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు ప్రతిభను కనబర్చాయి. ప్రైవేటుకు దీటుగా ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయి. జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సర ఫలితాల్లో 2,618 మంది పరీక్షలు రాయగా.. 1,608 మంది విద్యార్థులు పాసయ్యారు. 61శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 2,446 మంది పరీక్షలు రాయగా.. 1,980 మంది పాసై, 81శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను బట్టి చూస్తే గతేడాది కంటే ఈసారి మెరగైన ఫలితాలు సాధించారు. గతేడాది ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జానియర్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరం 57శాతం ఫలితాలు సాధించగా.. సెకండియర్‌లో 79శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది కంటే ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 4శాతం ఉత్తీర్ణత పెరగగా.. సెకండియర్‌లో 2శాతం అధికంగా నమోదైంది. 

ప్రథమంలో మొదటి స్థానం జగదేవ్‌పూర్‌, దౌల్తాబాద్‌.. 

ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో 97శాతం ఉత్తీర్ణతతో జగదేవ్‌పూర్‌ ,దౌల్తాబాద్‌ ప్రభుత్వ జానియర్‌ కళాశాలలు మొదటి స్థానంలో నిలిచాయి. జగదేవ్‌పూర్‌ కళాశాలలో 102 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 99 మంది విద్యార్థులు పాసయ్యారు. దౌల్తాబాద్‌ కళాశాలలో 144 మంది విద్యార్థులకు 141 మంది ఉత్తీర్ణత సాధించారు. 96 శాతం ఉత్తీర్ణతో తొగుట ప్రభుత్వ జానియర్‌ కళాశాల రెండో స్థానంలో ఉంది. మిరుదొడ్డి ప్రభుత్వ జానియర్‌ కళాశాల 23 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఈ కళాశాలలో 105 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. కేవలం 24 మంది విద్యార్థులు పాసయ్యారు. ఆ తర్వాత స్థానంలో చేర్యాల, దుబ్బాక జూనియర్‌ కళాశాలలు 27శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉన్నాయి.   

సెకండియర్‌లో వంద శాతంతో తొగుట కళాశాల మొదటి స్థానం.. 

సెకండియర్‌ ఫలితాల్లో తొగుట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రభంజనం సృష్టించింది. వంద శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో మొదటి స్థానం సాధించింది. ఈ కళాశాలలో 152 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. అందరూ పాసయ్యారు. 99 శాతం ఉత్తీర్ణతో జగదేవ్‌పూర్‌ ప్రభుత్వ కళాశాల రెండో స్థానంలో ఉండగా, 98శాతంతో దౌల్తాబాద్‌ కళాశాల మూడో స్థానంలో నిలిచింది. 48శాతం ఉత్తీర్ణతతో చేర్యాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల చివరి స్థానంలో ఉంది. ఈ కళాశాలకు చెందిన 58 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. కేవలం 28 మంది మాత్రమే పాసయ్యారు.

మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ పాఠశాలల 

ఇంటర్‌ ఫలితాలు.. 

సిద్దిపేట జిల్లాలోని 14 ఆదర్శ పాఠశాలల్లో ప్రథమ సంవత్సరంలో 1,344 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. 882 మంది పాసయ్యారు. 65.63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 1061 మంది విద్యార్థులకు 845 మంది పాసై, 79.64 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని ఇంటర్‌ పరీక్షలు రాసిన మూడు కస్తూర్బా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ప్రథమ సంవత్సరంలో 192 మంది పరీక్షలు రాయగా.. 162 మంది పాసయ్యారు. 84.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 97మంది విద్యార్థులు హాజరు కాగా.. 72 మంది విద్యార్థులు పాసై, 74.72శాతం ఉత్తీర్ణత నమోదైంది.


logo