గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Jun 19, 2020 , 01:13:00

ముమ్మరంగా కాలువ పనులు

ముమ్మరంగా కాలువ పనులు

  •  అండర్‌ టన్నెల్‌ల నిర్మాణం.. వరదపోవడానికి ప్రత్యేక సౌకర్యం

గజ్వేల్‌ : కొండపోచమ్మ సాగర్‌.. గోదావరి జలాలతో నిండుతుండగా పొలాలకు నీటిని తరలించడానికి సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు కాలువ నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌ మండలంలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ నుంచి రామాయంపేట కాలువ నిర్మాణ పనులు  చురుకుగా సాగుతున్నాయి. సుమారు 54 కిలోమీటర్ల పొడువున వివిధ  గ్రామాల గుండా ఈ కాలువను నిర్మిస్తున్నారు. ఇప్పటికే మర్కూక్‌, వర్గల్‌, గజ్వేల్‌, రాయపోలు తదితర మండలాల్లో కాలువ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొండపోచమ్మ సాగర్‌ నుంచి గౌరారం వరకు వచ్చిన తర్వాత ఈ కాలువ సంగారెడ్డి, రామాయంపేట కాలువలుగా విడిపోతాయి. గౌరారం వద్ద రాజీవ్‌ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం  జరుగుతున్నది, ఇది పూర్తయితే  నీటిని వదులుతారు. కాలువ మధ్యలో చెరువు అలుగు పారే నీటిని ఎప్పటిలాగే నీరు కింది చెరువులోకి చేరడానికి అండర్‌ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. పైనుంచి కెనాల్‌ నిర్మా ణం.. కింది నుంచి చెరువు వరద మరో చెరువులోకి చేరడానికి యూటీలను నిర్మిస్తున్నారు. వర్గల్‌ మండలం చాంద్‌ఖాన్‌ మక్తశివారులో రెండు కుంటల మధ్య రామాయంపేట కాలువపై అండర్‌ టన్నెల్‌ నిర్మాణం చురుకుగా జరుగుతున్నది. అత్యంత పటిష్టంగా నిర్మిస్తున్న ఈయూ టీపై నుంచి రామాయంపేట కాలువ నీరు పారగా కింది నుంచి కోడెంకుంట వరద కాగితాల కుంటలోకి  చేరుతుందని కాళేశ్వరం ఈఈ బద్రీనాథ్‌ తెలిపారు. ఇలాంటి యూ టీలు కాలువకు అవసరం ఉన్నాయని, అన్ని ప్రాంతాల్లో నిర్మిస్తున్నట్లు చెప్పారు. 


logo