శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 17, 2020 , 23:53:59

రూ.4.50 లక్షల అంబర్‌ ప్యాకెట్ల పట్టివేత

రూ.4.50 లక్షల అంబర్‌ ప్యాకెట్ల పట్టివేత

  • ముగ్గురి అరెస్ట్‌, కారు సీజ్‌ 

హుస్నాబాద్‌ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున రూ.4.50లక్షల విలువైన ‘అంబర్‌ ఖైనీ’ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నట్లు ఏసీపీ మహేందర్‌ తెలిపారు. బుధవారం హుస్నాబాద్‌ ఠాణాలో ఆయన వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు ఉదయం 4గంటల సమయంలో ఎస్సై దాస సుధాకర్‌ సిబ్బందితో కలిసి పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద కారు(టీఎస్‌ 25బీ 5887)ను తనిఖీ చేశారు. కారులో తొమ్మిది బస్తాల నిషేధిత అంబర్‌ ప్యాకెట్లు దొరకడంతో కారును సీజ్‌ చేసి, ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. వాటి విలువ రూ.4.50లక్షలు ఉంటుందని చెప్పారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిచాల గ్రామానికి చెందిన దావరవేని నారాయణరావు  బీదర్‌ నుంచి టేకుమట్లకు అంబర్‌ ప్యాకెట్ల బస్తాలను తరలిస్తున్నాడు. నారాయణరావుకు సహాయకుడిగా ఉన్న నారేండ్ల చందు, కార్డు డ్రైవర్‌ కుంభం రమేశ్‌ను అరెస్టు చేసినట్లు వివరించారు. ఎస్సై సుధాకర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ సంపత్‌, కానిస్టేబుల్‌ త్యాగరాజు, హోంగార్డు మల్లారెడ్డిని ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాస్‌, అక్కన్నపేట ఎస్సై రవి పాల్గొన్నారు. 

రూ.5 లక్షల గంజాయి స్వాధీనం

ఝరాసంగం : పక్కా సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చీలపల్లి చౌరస్తా వద్ద బుధవారం తెల్లవారుజూమున 98కిలో గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై ఏడుకొండలు తెలిపారు. చీలపల్లి తండాకు చెందిన వినోద్‌కుమార్‌, అరవింద్‌ మహారాష్ట్రలోని షోలాపూర్‌కు బస్తాల్లో గంజాయిని తరలిస్తుండగా, చీలపల్లి చౌరస్తా వద్ద వారిని పట్టుకున్నట్లు చెప్పారు. గంజాయి విలువ సుమారు రూ. 5లక్షల వరకు ఉంటుందన్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ తారాసింగ్‌, పోలీసులు ఉన్నారు.


logo