సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 17, 2020 , 23:52:18

పురస్కారాల కోట.. సిద్దిపేట

పురస్కారాల కోట.. సిద్దిపేట

l దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ 

l స్వశక్తీకరణ్‌ పురస్కారానికి రెండు గ్రామాలు

l పెద్దలింగారెడ్డిపల్లి, గుర్రాలంగొంది ఎంపిక 

l ఈ నెల 21, 22 తేదీల్లో అవార్డు అందుకోనున్న సర్పంచులు

l అభినందించిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట రూరల్‌/నారాయణరావుపేట : ఉత్తమ గ్రామపంచాయతీలకు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఏటా ప్రకటించే ‘దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీకరణ్‌' పురస్కారాల్లో సిద్దిపేట నియోజకవర్గానికి రెండు దక్కాయి. ఈ ఏడాది జనరల్‌ కేటగిరీలో రాష్ర్టానికి ఏడు పురస్కారాలు దక్కగా.. అందులో సిద్దిపేటకే రెండు వరించాయి. సిద్దిపేట రూరల్‌ మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లితో పాటు నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామాలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఈనెల 21,22 తేదీల్లో ఆయా గ్రామాల సర్పంచులు ఈ పురస్కారాలను అందుకోనున్నారు. ఒకేసారి నియోజకవర్గానికి రెండు జాతీయ పురస్కారాలు దక్కడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

పరిగణనలోకి 9 అంశాలు..

కేంద్ర ప్రభుత్వం అందించే ‘దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ్‌' పురస్కారానికి గ్రామంలో జరిగే వివిధ రకాలైన 9 అంశాలను పరిశీలిస్తారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీరు, వీధిధీపాల పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన- నిర్వహణ, సహజ వనరుల నిర్వహణ, సామాజికరంగ పనితీరు, విపత్తు నిర్వహణ, స్వచ్ఛంద సంస్థల పనితీరు, రెవెన్యూ జనరేషన్‌.. ఇలా పలు రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. తొమ్మిది అంశాల్లో  మార్కులు సాధించినందుకు గానూ ఈ గ్రామపంచాయతీలు ‘దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ్‌' పురస్కారానికి ఎంపికయ్యాయి.

పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ రెండు గ్రామాలు..

మంగళవారం ప్రకటించిన ‘దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ్‌' పురస్కారానికి ఎంపికైన గుర్రాలగొంది, పెద్దలింగారెడ్డి గ్రామాలు ఇది వరకే పలు అవార్డులను సొంతం చేసకున్నాయి. నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామం 2015-16లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఉత్తమ గ్రామపంచాయతీగా, 2017-18లో హరితమిత్ర స్టేట్‌ లెవల్‌ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపిక కాగా, 2019-20 సిద్దిపేట జిల్లా ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైంది. సిద్దిపేట రూరల్‌ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామం 2019-20 సంవత్సరానికి సిద్దిపేట జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుకు ఎంపికైంది. అవార్డులు రావడమే కాకుండా పలు విషయాల్లో ఈ రెండు గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. 


సంతోషంగా ఉంది..

ఈ పురస్కారానికి మా గ్రామం ఎంపిక కావడం సంతోషంగా ఉంది. దీనికి కారణమైన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు,  గ్రామస్తులకు కృతజ్ఞతలు. మరిన్ని అవార్డులు రావడానికి ఎల్లవేళలా కృషిచేస్తాం. 

- శాతరాజుపల్లి ఆంజనేయులు, గుర్రాలగొంది సర్పంచ్‌  

ఐక్యతకు నిదర్శనం

జాతీయ స్థాయిలో నియోజకవర్గానికి రెండు పురస్కారాలు రావడం గ్రామాల ఐక్యతకు నిదర్శనం.  గుర్రాలగొంది, పెద్దలింగారెడ్డిపల్లి సర్పంచులకు అభినందనలు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించి మరిన్ని అవార్డులు సాధించాలి. 

-తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి


logo