గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Jun 17, 2020 , 23:30:31

నారింజ ప్రాజెక్టు గేట్ల తుప్పు వదిలింది

నారింజ ప్రాజెక్టు గేట్ల తుప్పు వదిలింది

గేట్లు, పూడికతీతకు రూ.71 లక్షలు మంజూరు 

జోరుగా కొనసాగుతున్న మరమ్మతు పనులు పూర్తికావచ్చిన పూడికతీత

గేట్ల ఏర్పాటుతో నీటి వృథాకు చెక్‌

ఎప్పుడో నిర్మించినప్పుడు ఏర్పాటు చేసిన గేట్లు తుప్పుబట్టాయి. ప్రాజెక్టు పూర్తిగా పూడికతో కూడుకుపోయింది. గత ప్రభుత్వాలు తుప్పును పట్టించుకోలేదు, పూడికను తీయలేదు. దీంతో సాగునీరందించాల్సిన నారింజ ప్రాజెక్టు వృథాగా మారింది. ఈ నిర్లక్ష్యాన్ని, వివక్షను గుర్తించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం..నారింజ ప్రాజెక్టు బాగుకోసం ముందుకు వచ్చింది. తుప్పుబట్టిన గేట్లు బాగు చేయిస్తున్నది. పూడిక తీయిస్తున్నది.

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జహీరాబాద్‌ నియోజకవర్గంలోని కొత్తూరు(బి)లోని నారింజ ప్రాజెక్టు కొత్తరూపును సంతరించుకుంటున్నది. ప్రభుత్వం రూ.71 లక్షలు మంజూరు చేయడంతో పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే 3వేల ఎకరాల ఆయకట్టుకు పైగా సాగునీరందనుంది. 

3 వేల ఎకరాలకు సాగునీరు...

3వేల ఎకరాలకు సాగు నీరందించడంతో పాటు జహీరాబాద్‌ ప్రాంతంలో తాగునీటి అవసరాల తీర్చడం కోసం కొత్తూరు(బీ)లో నారింజ ప్రాజెక్టు నిర్మించారు. దీంతో స్థానిక తాగునీటి అవసరాలు సైతం తీర్చుకునే వీలుంటుంది. జహీరాబాద్‌, మొగుడంపల్లి, కోహీర్‌, న్యాల్‌కల్‌, ఝరాసంగం మండలాలు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం పొందుతాయి. ఏళ్ల కింద నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. కుడి, ఎడమ కాలవలు పాడయ్యాయి. మరమ్మతులు లేకపోవడంతో గేట్లు తుప్పుపట్టి నీరు మొత్తం లీకై కర్ణాటక వైపు వెళ్లిపోయింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు మొత్తం మట్టితో కూడుకుపోయింది. ఎప్పుడు కూడా పూడిక తీయించలేదు. దీంతో ప్రాజెక్టు కేవలం నిరర్ధక ఆస్తిలా మిగిలిపోయింది.  

రూ.71 లక్షలు మంజూరు...

స్థానిక ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ నారింజ ప్రాజెక్టు మరమ్మతులకు కావాల్సిన నిధుల కోసం జిల్లా మంత్రి హరీశ్‌రావును సంప్రదించారు. మంత్రి హరీశ్‌రావు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇటీవలే రూ.71 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.18 లక్షలు ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు, రూ.53 లక్షలు పూడికతీతకు వెచ్చిస్తున్నారు. నారింజ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని, ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కలెక్టర్‌ హనుమంతరావుకు మంత్రి సూచించారు. ఇటీవలే మరమ్మతుల పనులను ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రారంబించారు. పనులు పూర్తయితే 3వేల ఎకరాలకు పైగా సాగు నీరందనుంది. వచ్చిన నీరు వచ్చినట్లు గేట్లు లీకై బయటకు వెళ్లిపోవడంతో ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి మేలు జరగకుండా పోయింది. పూడికతీత దాదాపుగా పూర్తికావచ్చింది. 


logo