శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 14, 2020 , 00:30:09

ఆన్‌లైన్‌లో వైజ్ఞానిక ప్రదర్శన

ఆన్‌లైన్‌లో వైజ్ఞానిక ప్రదర్శన

కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో నిర్ణయం

l  ఒక్కో పాఠశాల నుంచి ఐదు ప్రదర్శనలకు అవకాశం  l జిల్లాలో 35 ప్రాజెక్టులు ఎంపిక

మెదక్‌ రూరల్‌ : ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో ఏటా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కానీ ఈ ఏటా (2019-20) కరోనా నేపథ్యంలో ప్రదర్శన ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22 నుంచి విధించిన లాక్‌డౌన్‌ ప్రభావంతో ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించాల్సిన వైజ్ఞానికి ప్రదర్శన వాయిదా పడింది. ఈ సారి నిర్వహిస్తారా లేదా అన్న సందేహలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వారికి తెలంగాణ విద్యాశాఖ విన్నవించిన మేరకు త్వరలోనే ఆన్‌లైన్‌ ద్వారా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. అందుకుగానూ విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. 2019-20 సంవత్సరానికి జిల్లాలో 35 ప్రదర్శనలు అవార్డ్స్‌ మనక్‌కు ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జూన్‌ చివరి వారంలో నిర్వహించనున్నారు.  తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్న కార్యక్రమమంలో విద్యార్థులు తయారు చేసే ప్రాజెక్టు, దాని పనితీరు, ఫలితాలు వంటి తదితర అంశాలను మొత్తం ఐదు నిమిషాల నిడివితో చిత్రీకరించాలి. దీన్ని సీడీలో ఆప్‌లోడ్‌ చేసి ప్రదర్శనలో విద్యార్థులు దృశ్య, శ్రవణంలో లేదంటే నేరుగా వచ్చి జిల్లా విద్యాశాఖ అధికారులకు చిత్రీకరణను చూపించాలి. అలాంటి సౌకర్యం లేనిచోట విద్యార్థులు, ఉపాధ్యాయులు గానీ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారమిస్తే విద్యార్థుల ప్రాజెక్టులను వారే వీడియో రూపంలో చిత్రీకరించనున్నారు. ప్రదర్శనలను జూన్‌ చివరి వారంలో జూమ్‌, గూగుల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిశీలించి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన వారిని జాతీయ స్థాయికి ఎంపిక చేయ నున్నారు.  

దరఖాస్తులకు ఆహ్వానం 

2020-21 సంవత్సరానికి ప్రదర్శనలకు జూన్‌ ఒకటి నుంచి జూలై చివరి వారం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలల ఉపాధ్యాయులకు తెలిపారు. అందుకు సంబంధించి వెబ్‌సైట్‌ తెరిచినందున విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇన్‌స్పైర్‌ అవార్డ్స్‌ మనక్‌లో www.inspireawards.dst.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. విద్యార్థుల పేర్లు, తరగతి, వారి ఆధార్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతా, పాఠశాల తదితర వివరాలు నమోదు చేయాలి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఒక్కో పాఠశాల నుంచి ఐదు ప్రదర్శనలకు అవకాశం ఉంటుంది. 6, 7 తరగతులు నుంచి రెండు, 8,9,10 తరగతుల నుంచి మూడు చొప్పున ప్రదర్శనలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  2010-11 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రదర్శనలకు ఎంపికైన విద్యార్థులకు రూ. 5 వేల చొప్పున చెల్లించారు. ఈ మొత్తాన్ని గత విద్యాసంవత్సరం నుంచి రెట్టింపు చేసి రూ.10 వేలు అందజేస్తున్నారు.  

తొలిసారిగా ఆన్‌లైన్‌లో..

కొవిడ్‌-19తో ఎక్కడి విద్యార్థులు అక్కడినుంచే ప్రదర్శనలకు ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలో ప్రదర్శించవచ్చు. విద్యార్థులకు నచ్చిన సృజనాత్మక, వినూత్న ఆలోచనలే ఆవిష్కరణగా మారుతాయి. వాటిని ప్రదర్శించడానికి ఇన్‌స్పైర్‌ మనాక్‌ చక్కని వేదిక. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారు.ప్రదర్శనకు ప్రభుత్వమే నిధులు సమకూర్చుతుంది. ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు.

-చిలుముల రాజిరెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి, మెదక్‌ 


logo