శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 14, 2020 , 00:30:06

అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు

 అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు

 l శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

 l రూ.4 కోట్ల 85 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ

l అంగన్‌వాడీ భవనాల  ప్రారంభోత్సవం

  మిరుదొడ్డి : కరోనా వైరస్‌ కాలంలో కూడా సీఎం కేసీఆర్‌ సంక్షేమం, అభివృద్ధిని రెండు కండ్లలాగ నిరాటంకంగా ప్రజలకు అందిస్త్తున్నారని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని భూంపల్లిలో రూ.3 కోట్ల 75 లక్షలతో 75 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు, రోడ్లు భవనాల శాఖ ద్వారా మంజూరైన రూ.40 లక్షల నిధులతో సైడ్‌ డ్రైనేజీ పనులు, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రూ.25 లక్షల నిధులతో పంచాయతీ భవన నిర్మాణానికి,  రూ.20 లక్షలతో నిర్మించే రైతువేదిక భవనానికి మొత్తం కలిపి రూ.4 కోట్ల 85 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం రూ.17 లక్షలతో నూతనంగా నిర్మించిన రెండు అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించారు.  మిరుదొడ్డి గ్రామానికి చెందిన గొట్టం విజయకు రూ.8,500, ఎర్రమైన అజయ్‌కి రూ.14 వేలు చొప్పున సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే రామలింగారెడ్డి పంపిణీ చేశారు.

 పచ్చని తివాచిలా నియోజకవర్గం 

   రైతులను రాజును చేయాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారని తెలిపారు.  త్వరలోనే చెబర్తి నుంచి నియోజకవర్గానికి సాగునీరును ప్రభుత్వం అందిస్తుందన్నారు. మల్లన్న సాగర్‌తో నియోజకవర్గంలోని గ్రామాలన్ని పచ్చని పంట పొలాలతో నిండిపోతాయన్నారు. రైతులు కాల్వల నిర్మాణాలకు సహకారం అందించాలని కోరారు.మిరుదొడ్డి, చెప్యాల, అల్వాల గ్రామాల్లో  పంచాయతీ భవనాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని పీఆర్‌ఏఈ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జెల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీలింగం, పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, మండల సీనియర్‌ నేత  శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ బోర్డు డైరెక్టర్‌ శ్రీనివాస్‌,  ఎంపీటీసీ ఉమారాణి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ రాజలింగారెడ్డి పాల్గొన్నారు. 


logo