శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 12, 2020 , 03:28:44

తడి, పొడి చెత్తను వేరు చేయాలి

 తడి, పొడి చెత్తను వేరు చేయాలి

  •  l  నిర్లక్ష్యం వహిస్తే జరిమానా తప్పదు..
  • l  తోపుగొండ, చెర్లగూడెం గ్రామాల పర్యటనలో కలెక్టర్‌  హనుమంతరావు  

కంది : గ్రామంలో ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేయాలని  సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. గురువారం మండలంలోని తోపుగొండ, చెర్లగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను  పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రత్యేకంగా ఇంటింటికీ చెత్త బుట్టలను అందజేసినట్లు చెప్పారు. చెత్తను వేరు చేయడంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఈ నెల 21 నుంచి 30 వరకు రూ.50 చొప్పున, జూలై 1 నుంచి 15 వరకు రూ. 500, 15 తర్వాత వెయ్యి  జరిమానా విధించేలా గ్రామ ప్రజల సమక్షంలో తీర్మానం చేయించారు. అనంతరం తోపుగొండలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. చెర్లగూడెం గ్రామ అభివృద్ధిని చూసి స్థానిక మాజీ సర్పంచ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఎంపీపీ సరళపుల్లారెడ్డిలను తోపుగొండ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్‌ గోపాల్‌రెడ్డిని సన్మానించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, జడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఎఫ్‌వో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో విజయలక్ష్మి, తాహసీల్దార్‌ రామాదేవి  తదితరులు ఉన్నారు. 

చెత్త, డంప్‌యార్డుకు చేరేలా చూడాలి..

తడి, పొడి చెత్త వంద శాతం వేరు చేసి డంప్‌యార్డుకు చేరేలా చూడాలని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో వెస్టే మేనేజ్‌మెంట్‌ ప్రొసీజర్‌పై ఎంపీడీలు, పీఈవోలు, 90 గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీలకు ప్రాథమిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 30లోగా అన్ని గ్రామాల్లో డంప్‌ యార్డులు పూర్తి కావాలని తెలిపారు. ఈ నెల 25లోగా అన్ని గ్రామాలకు ట్రాక్టర్‌, ట్రాలీలు వస్తున్నాయని, ఆ లోగా ఉన్న రిక్షాలను ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో చెత్తను తరలించాలన్నారు. అంతకుముందు కంది ఐఐటీ ప్రొఫెసర్‌ దేబరాజ్‌ భట్టాచార్య పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు.


logo