ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 12, 2020 , 01:47:33

పేదల కోసమే సంక్షేమ పథకాలు

పేదల కోసమే సంక్షేమ పథకాలు

శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 

మిరుదొడ్డి : గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. గురువారం మల్లుపల్లి గ్రామంలో రోడ్డు భవనాల శాఖ ద్వారా మంజూరైన రూ.28 లక్షల సైడ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందిన బైకరి ఆంజనేయులు, గుండెపోటుతో మరణించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త అక్కరాజ్‌ బాలకృష్ణ, అజయ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలకృష్ణ కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఖాజీపూర్‌ గ్రామానికి చెందిన బి.కమలవ్వకు రూ.12 వేలు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అర్హులైన పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదన్నారు. ఈనెల 17వ తేదీన డబుల్‌ బెడ్‌ రూంల గృహ ప్రవేశం కార్యక్రమానికి తగు చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ సిద్ది భారతి భూపతి గౌడ్‌కు సూచించారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు అర్హుల పేర్లను ఎంపిక చేయాలని ఫోన్‌ ద్వారా తహసీల్దార్‌ను ఆదేశించారు. గ్రామానికి మరో పది డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలతో ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జెల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీ లింగం, పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య, వైస్‌ ఎంపీపీ పోలీస్‌ రాజులు, పార్టీ నాయకులు పంజాల శ్రీనివాస్‌ గౌడ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నంట బాపురెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు లింగాల వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పాల్గొన్నారు.


logo