ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 11, 2020 , 02:58:12

వానకాలం.. నియంత్రితం

వానకాలం.. నియంత్రితం

n వానకాల వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా రైతాంగం

n నియంత్రిత సాగుకు గ్రామాలు ఏకం

n తూకం పోసి.. నాటుకు పొలాలు సిద్ధం

n పత్తి సాగుకే ప్రాధాన్యమిస్తున్న రైతులు 

n నల్లరేగడిలో పత్తి విత్తనాలు పెడుతున్న కర్షకులు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: రోహిణి కార్తె ముగిసి, మృగశిర కార్తె ప్రారంభమైంది. బుధ వారం వర్షం కురవడంతో వానకాలం పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. సాగుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామాల్లో ముందస్తుగానే రైతులకు సరిపడా సబ్సిడీ విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉం చింది. ఈ సారి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపగా, దానికి అనుగుణంగా విత్తనాలు విత్తుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. నియంత్రిత సాగుపై వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ పిలుపుతో గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాల్లో వంద శాతం గ్రామాలు, దుబ్బాక, హుస్నాబాద్‌ తదితర నియోజకవర్గాల్లో 95 శాతానికి పైగా రైతులు నియంత్రిత సాగు చేస్తామంటూ తీర్మానాలు చేసి, అధికారులకు అందించారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని ముందస్తుగానే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

దుక్కులు దున్ని.. విత్తనాలు వేసి..

వర్షాలకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. నల్లరేగడి భూముల్లో దుక్కులను సిద్ధం చేసి, కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు వేస్తున్నారు. కొన్నిచోట్ల నల్లరేగడి భూముల్లో పత్తి విత్తనాలకు గుంటుకతో లైన్లు వేసి సిద్ధం చేసుకుంటున్నారు. మరో రెండు మూడు వర్షాలు పడేవరకు విత్తనాలు వేయవద్దంటూ రైతాంగానికి వ్యవసాయశాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. భూమిలో వేడిమి తగ్గలేదు కాబట్టి, మరో రెండు వర్షాలు పడ్డాక విత్తనాలు వేస్తే మంచి మొలకలు వచ్చి ఏపుగా ఎదిగి అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కాగా, బ్లాక్‌లో విత్తనాలు అమ్మే వ్యాపారులపై కఠిన చర్య లు తీసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో పలుచోట్ల వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఆయా మం డలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.  

జిల్లాలో కురిసిన తొలకరి వాన

మృగశిరలో వర్షాలు కురువడంతో జిల్లా రైతాం గం వానకాలం పనుల్లో నిమగ్నమైంది. వానకాలం సాగుపై రైతులు కోటి ఆశలతో సాగుచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని రిజర్వాయర్లు నిండాయి. రంగనాయకసాగర్‌, అన్నపూర్ణ రిజర్వాయర్‌ ద్వారా సిద్దిపేట జిల్లాలోని కొన్ని గ్రామాల చెరువులు, కుంటలకు నీళ్లు వచ్చి చేరాయి. దసరా నాటికి ఉమ్మడి జిల్లాలో గోదావరి జలాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోనున్నాయి. వానకాలం సాగును రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో సాగు చేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లాల వారీగా సాగు వివరాలను ఆయా జిల్లాలకు పంపింది. గ్రామాల వారీగా ఏ పంట ఎంత వేయాలో వ్యవసాయశాఖ అధికారులు నివేదికను రూపొందించారు. వరి పంటలో 60 శాతం సన్నరకం సాగుచేయాలని సూచించింది. ఇందులో తెలంగాణ సోన రకం వరిసాగు చేయాలని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించింది. వరితో పాటు పత్తి పంటసాగు విస్తీర్ణాన్ని భారీగా పెంచాలని నిర్ణయించింది. పత్తితోపాటు కంది, పెసర్లు, మినుములు, ఆముదం, కూరగాయల సాగుతోపాటు సుమారు 1200 ఎకరాల్లో స్వీట్‌కార్న్‌ సాగుచేయనున్నారు.  ఉమ్మడి జిల్లాల్లో వానకాలం పంటగా వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. సన్న రకాల సాగును ప్రభుత్వం ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. సాగు అంచనాలో 60 శాతం సన్నరకాలు ఉండేలా వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వానకాలం సాగుకు కొందరు తూకం పోసి, నాట్ల దశకు రాగా, మరికొంత మంది తూకం పోస్తున్నారు. ట్రాక్టర్లతో నాటుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు.logo