సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 08, 2020 , 00:11:06

ఆరోగ్యం మన చేతుల్లోనే..

ఆరోగ్యం మన చేతుల్లోనే..

 ప్లాస్టిక్‌ రహితానికి స్టీల్‌ బ్యాంకు పునాది

 స్టీల్‌ బాక్సు తెస్తేనే మటన్‌, చికెన్‌ అంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి    

కరోనా నివారణకు  జాగ్రత్తలు తప్పనిసరి.. 

స్టీల్‌ బ్యాంకుల ప్రారంభోత్సవంలో  మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌/ సిద్దిపేట టౌన్‌/ సిద్దిపేట అర్బన్‌ : ప్లాస్టిక్‌ రహిత పట్టణానికి పునాది స్టీల్‌ బ్యాంకు అని.. ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని తగ్గిస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చని, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. 

సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని 4,9,13 వార్డుల్లో బాల వికాస, మున్సిపల్‌ సంయుక్త భాగస్వామ్యం, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం  స్టీల్‌ బ్యాంకును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  మాట్లాడుతూ స్టీల్‌ బ్యాంకులో తక్కువ ధరకు వస్తువులను పొందవచ్చని, ఇందులో 12 రకాల వస్తువులు, 750 ప్లేట్లు అందుబాటులో ఉన్నాయని, పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దాలని ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఇంట్లో తడి, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. అంతేకాకుండా నీటి వృథాను అరికట్టి భవిష్యత్‌ తరాలకు నీటి ఆవశ్యకతను వివరించాలన్నారు. పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్‌ శాంతి చేపట్టిన కార్యక్రమాలతో మూడు వారాల్లోనే చాలా మార్పు వచ్చిందని, బయట చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. అంతకు ముందు 4వ వార్డులో భువనగిరి బాలమణి ఇంట్లో శుభకార్యానికి మంత్రి చేతుల మీదుగా స్టీల్‌ బ్యాంకు సామగ్రిని అందజేశారు. 

 15 రోజుల్లో గోదావరి జలాలు 

గోదావరి జలాలను మరో 15 రోజుల్లో నర్సపురానికి తేనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కూడా నర్సపురం వాసులకు కేటాయిస్తామని భరోసానిచ్చారు. గ్రామ పరిధిలోని చెరువును శుద్ధి చేసేలా ఎస్‌టీపీ సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ జంక్షన్‌ అభివృద్ధితో పాటు నాలుగు లేన్ల రోడ్డు  పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రూ.40 లక్షలతో ఎస్సీ భవనాన్ని నిర్మించనున్నామని తెలిపారు.  కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు రాజనర్సు, కౌన్సిలర్లు దీప్తి నాగరాజు, పల్లె వెంకట్‌గౌడ్‌, బండారి నర్సింహులు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారు. 

 కార్యకర్తలకు అండగా ఉంటాం..

 టీఆర్‌ఎస్‌ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతికార్యకర్తకు బీమా సదుపాయాన్ని సీఎం కేసీఆర్‌ కల్పించారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అనంతసాగర్‌ గ్రామవాసి పోతరాజు అఖిల్‌కు టీఆర్‌ఎస్‌ సభ్యత్వం కలిగి ఉండటంతో సిద్దిపేటలోని తన నివాసంలో మృతుడి కుటుంబ సభ్యులకు రూ. రెండు లక్షల చెక్కును అందజేశారు. 

స్టీల్‌ బాక్సు తెస్తేనే.. మటన్‌, చికెన్‌ 

సిద్దిపేట ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను తనిఖీ చేసిన మంత్రి హరీశ్‌రావు, జూట్‌ బ్యాగ్‌, స్టీల్‌ బాక్సుతో  వస్తేనే మటన్‌, చికెన్‌ విక్రయించాలన్నారు. షాపుల ఎదుట సూచిక బోర్డులు  తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెట్‌లో మాంసం విక్రయాన్ని పరిశీలిస్తుండగా ఓ వ్యాపారి మోతుకాకుల్లో మాంసం పెట్టి విక్రయిస్తుండటంతో అతడిని అభినందించి రూ.500 నజరానా అందించారు.  రెండో విడుత పట్టణ ప్రగతి డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు  ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశుభ్రతపై సమీక్ష  నిర్వహించాలని ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, మార్కెటింగ్‌ శాఖ అధికారి పరమేశ్వర్‌ను ఆదేశించారు.  

విశ్రాంత ఉద్యోగుల భవనం ప్రారంభోత్సవంలో మంత్రి   

గజ్వేల్‌/ గజ్వేల్‌అర్బన్‌ : అనుభవం గొప్ప సంపద అని దానిని తోటివారికి పంచడం వల్ల సమాజాభివృద్ధికి వీలుకలుగుతుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌లో విశ్రాంత ఉద్యోగుల భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.  ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందినప్పటికీ చాలా మంది సమాజం కోసం ప్రజాసేవలో ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్‌ కోరుకున్నట్లు అన్ని రంగాల్లో  గజ్వేల్‌  అగ్రగామిగా నిలిచిందని, విశ్రాంత ఉద్యోగులు కోరగానే రాష్ట్రంలోఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలతో భవన సముదాయాన్ని కేటాయించారని మంత్రి పేర్కొన్నారు. వచ్చే హరితహారం కార్యక్రమంలో పట్టణాన్ని  హరితవనంగా మార్చాలని సూచించారు. రోజురోజుకూ దేశంలో  కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, జూన్‌, జూలై మాసంలో మరింతగా పెరిగే ప్రమా దముందన్నారు  వైరస్‌ వ్యాప్తి నిర్మూలను జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో విశ్రాంత ఉద్యోగుల పాత్ర మరువలేనిదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి,  జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, దేవీప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, డాక్టర్‌ యాదవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, మాదాసు శ్రీనివాస్‌, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన కోడ్‌మెన్స్‌ షాపింగ్‌ మాల్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.  

కళావతికి మెరుగైన వైద్యం అందించాలి

 జూన్‌ 2న దౌల్తాబాద్‌ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయా కళావతి జెండా ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై గజ్వేల్‌ దవాఖానలో చికిత్స పొందుతుండగా, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆమెను మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. ఎంత డబ్బు ఖర్చు అయినా వెనుకాడవద్దని, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు. తక్షణ అవసరాల కోసం రూ.50 వేల నగదు అందించారు.  


logo