శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 07, 2020 , 00:21:41

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

దుబ్బాక టౌన్‌ : జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. పది రోజుల  కింద దుబ్బాకలో ఇంటి పైకప్పు కూలి మృతి చెందిన జర్నలిస్టు నక్క మల్లికార్జున్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యే శనివారం సాయంత్రం పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ తరుఫున రూ. లక్షా 50 వేలను అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి చేయూతనందిస్తున్నదన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి మల్లికార్జున్‌ కుటుంబాన్ని ఆదుకునేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితాభూంరెడ్డి, కౌన్సిలర్లు దేవుని లలిత, ఆస యాదగిరి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు తౌడ శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శేర్ల కైలాశ్‌ తదితరులు ఉన్నారు.  

బీమా ప్రొసీడింగ్‌ పత్రాల అందజేత  

మిరుదొడ్డి : మృతి చెందిన రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 లక్షల రైతుబీమా   ప్రొసీడింగ్‌ పత్రాలను శనివారం ఎమ్మెల్యే రామలింగారెడ్డి అందజేశారు. మిరుదొడ్డిలో కాన్గంటి నారాయణ, అల్వాలలో బొమ్మ ముత్యాలు, తలారి రాజ నర్సయ్య, ఎసిరి అంజమ్మ, మోతెలో కొత్త నాగిరెడ్డి, భూంపల్లిలో మద్దికుంట నర్సింలు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున ఎంపీపీ గజ్జెల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీలింగం, పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం భూంపల్లి గ్రామంలో రైతు మస్క స్వామికి పరిహారం అందజేశారు.  కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రాజులు, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేతలు పంజాల శ్రీనివాస్‌ గౌడ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నంట బాపురెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచులు రాములు, కిష్టయ్య, శ్రీనివాస్‌, ఏవో మల్లేశం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సత్తయ్య పాల్గొన్నారు. 

‘పల్లె ప్రగతి’ పనుల్లో నిర్లక్ష్యం పలువురికి నోటీసులు జారీ 

మెదక్‌ : పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురికి కలెక్టర్‌ ధర్మారెడ్డి నోటీసులు జారీ చేశారు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మం డలం కాళ్లకల్‌ పంచాయతీ కార్యదర్శి సంతోశ్‌కుమార్‌ తడి, పొడి చెత్త వేరు చేసి సేకరించడం, ఇంటింటికీ చెత్తను సేకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి గల కారణాలను తెలియజేయాలంటూ మనోహరాబాద్‌ ఎంపీడీవో జైపాల్‌రెడ్డికి మెమో, సర్పంచ్‌ నత్తి మల్లేశ్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సస్పెండ్‌, మెమో, షోకాజ్‌ నోటీసులకు సంబంధించిన ఉత్తర్వులను డీపీవో హనోక్‌కు అందించారు.


logo