శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 05, 2020 , 23:34:52

అర్హులందరికీ రుణాలియ్యాలి

అర్హులందరికీ రుణాలియ్యాలి

సిద్దిపేట కలెక్టరేట్‌ / మెదక్‌ : కరోనా వైరస్‌తో చాలా ఇబ్బందులొచ్చాయని, అర్హులందరికీ త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సిద్దిపేట, మెదక్‌ కలెక్టర్లు వెంకట్రామ్‌రెడ్డి, ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ఆయా కలెక్టరేట్లలో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశాలను నిర్వహించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ లక్ష్మీప్రసాద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు, ప్రత్యేకాధికారులు, బ్యాంకు అధికారులు చొరవ చూపి జిల్లాలను మొదటి స్థానంలో నిలుపాలన్నారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, పరిశ్రమలు, చేనేత గ్రామీణ అభివృద్ధి సంస్థలు వంటి సంబంధిత శాఖల అధికారులు సమయపాలన పాటించి ఉన్నటువంటి కొద్ది సమయాన్ని వినియోగించుకొని జిల్లాలో ఎక్కువ మందికి రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ -19 కారణంగా ఆర్థికంగా చితికిపోయిన చిన్న, మధ్యతరహా వంటి పరిశ్రమలు తయారీ, సేవారంగాలు తిరిగి పుంజుకోవడానికి బ్యాంకుల ద్వారా అవసరమైన ఆర్థిక సహాయాన్ని తీసుకొని వ్యాపారాలను పునరుద్ధరించడంతో పాటు ఆర్థిక ఎదుగుదల పూర్వస్థితికి వచ్చేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో ఆయా బ్యాంకులు రుణాల మంజూరులో ఎక్కువ మంది అర్హులైనప్పటికీ లబ్ధిదారులందరికీ చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీ పథకం కింద గొర్రెల షెడ్ల నిర్మాణం, పాల ఉత్పత్తి షెడ్ల నిర్మాణాలకు రుణాలు అందజేయాలన్నారు. ఎవరైతే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చిరువ్యాపారులకు తక్షణ రుణసదుపాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ ముద్రలోన్‌ రూపంలో చేనేత కార్మికులకు రుణాలను అందజేయాలన్నారు. సిద్దిపేటలో అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, ఆయా బ్యాంకుల అధికారులు, జిల్లా శాఖల అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొనగా, మెదక్‌లో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖాధికారి పరశురాంనాయక్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ కృష్ణమూర్తి, జిల్లాలోని ఆయా బ్యాంకుల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గౌరవెళ్లి రిజర్వాయర్‌ పనులు.. త్వరిత గతిన పూర్తి చేయాలి

సిద్దిపేట కలెక్టరేట్‌ : గౌరవెళ్లి రిజర్వాయర్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గౌరవెళ్లి రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న  రైతులతో ఎమ్మెల్యే  వొడితెల సతీశ్‌కుమార్‌, ఆర్డీవో జయచంద్రరెడ్డి, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. భూ సేకరణ విషయంపై రైతులతో సామరస్యపూర్వకంగా చర్చించి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటికోసం పూర్తి సహకారం అందిస్తామన్నారు. త్వరలోనే గౌరవెళ్లికి గోదావరి జాలాలు రానున్నందున పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.


logo