గురువారం 02 జూలై 2020
Siddipet - Jun 05, 2020 , 00:12:40

సీజనల్‌పై ‘ప్రత్యేక’ సమరం

సీజనల్‌పై ‘ప్రత్యేక’ సమరం

 మిరుదొడ్డి : పారిశుధ్య గ్రామాలుగా తీర్చిద్దిడానికే సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఎంపీపీ గజ్జెల సాయిలు, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేతలు సూకురి లింగం, పంజాల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. గురువారం బేగంపేట, ఖాజీపూర్‌, రుద్రారం గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్‌గా వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో  సర్పంచ్‌లు పోతారం అనసూయ, పెర్క మమత, మల్లన్నగారి శాంతమ్మ, ఎంపీటీసీలు ఉమారాణి  , భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న ప్రగతి పనులు 

 కొమురవెల్లి : మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. వీధుల్లో చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి చదును చేశారు. ఈ సందర్భంగా ఆయా సర్పంచ్‌లు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలని, పరిశుభ్రతతోనే సీజనల్‌ వ్యాధులు దరిచేరవన్నారు. 

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం..

 హుస్నాబాద్‌ టౌన్‌ : పట్టణ ప్రగతిలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం పట్టణంలోని 5,6,7వ వార్డుల్లో  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఆకుల రజిత పర్యటించి సమస్యలను వింటూ, కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మురికి కాల్వ లేకపోవడంతో మురుగు నీరు ఇండ్ల మధ్యనే ఉండిపోవడంతో రోగాలు వచ్చే ప్రమాదం ఉందని, తక్షణమే మురికి కాల్వను నిర్మించి, చెత్తాచెదారాన్ని తొలగించాలని ఐదో వార్డుకు చెందిన పలువురు చైర్‌ పర్సన్‌, కమిషనర్‌ రాజమల్లయ్యకు విన్నవించారు. అనంతరం మురికి కాల్వల్లో దోమల మందును చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ అనిత స్ప్రే చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌, కౌన్సిలర్లు భాగ్యారెడ్డి, లావణ్య, పద్మ, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంతి, జూనియర్‌ అసిస్టెంట్‌ ఉన్నారు. 

 అక్కన్నపేటలో..

 అక్కన్నపేట :  మండలంలోని అక్కన్నపేట, అంతకపేట, కట్కూర్‌, మల్లంపల్లి, జనగామ, ధర్మారం, రామవరం, గండిపల్లి, గౌరవెల్లి తదితర గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు కలిసి పరిసరాలు, మురికి కాల్వలను శుభ్రం చేశారు.   

హుస్నాబాద్‌ మండలంలో..

హుస్నాబాద్‌ రూరల్‌ :  పందిల్ల, మీర్జాపూర్‌, తోటపల్లి, నాగారం, ఉమ్మాపూర్‌, కూచనపల్లి, మాలపల్లి తదితర గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. తడి, పొడి చెత్త సేకరణతో పాటు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో తిరుగుతూ ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు.  

ప్రజల భాగస్వామ్యంతో..

చేర్యాల : మండలంలోని చిట్యాలలో సర్పంచ్‌ రాంమ్మోహన్‌ ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

 ఉత్సాహంగా ‘పల్లెప్రగతి’..

తొగుట :  మండలంలోని పల్లెపహాడ్‌, వెంకట్‌రావుపేట, జప్తిలింగారెడ్డిపల్లి, వేములఘాట్‌ గ్రామాల్లో మురికి కాలువలు శుభ్రం చేశారు. జేసీబీ, ట్రాక్టర్‌ డోజర్లతో పిచ్చి మొక్కలను తొలిగించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేశారు. 

జాలపల్లిలో.. 

మద్దూరు : మండలంలోని జాలపల్లిలో సర్పంచ్‌ చొప్పరి వరలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.  సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.  


logo