మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 01, 2020 , 01:10:57

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరి మృతి

ఎనిమిది మందికి గాయాలు

కొండపాక/రామాయంపేట : మండలంలోని రాజీవ్‌ రహదారిపై ఆదివారం మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిన్నకిష్టాపూర్‌ స్టేజ్‌ సమీపంలో గుర్తుతెలియని వాహనాన్ని గ్యాస్‌ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.  దుద్దెడ టోల్‌ ప్లాజా సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతి చెందిన డ్రైవర్‌ చర్లపల్లికి చెందిన సనపతి బాబురావు (42)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

బోర్‌బండి బోల్తా ఘటనలో.. 

 హైదరాబాద్‌ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న బోరుబండి కొండపాక శివారులో ఆనంద నిలయం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డ్రిల్లర్‌ రాజేశ్‌, డ్రైవర్లు నల్గొండకు చెందిన శంకర్‌, యాదాద్రి జిల్లా మొగిలిపాకకు చెందిన రాజు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీలు ఆత్మ, కోసలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కుకునూర్‌పల్లి పోలీసులు తెలిపారు. 

అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ వద్ద.. 

అక్కన్నపేట రైల్వేస్టేషన్‌కు చెందిన శేఖర్‌ కాలినడకన వస్తుండగా అక్కన్నపేటకు చెందిన మహేశ్‌, నవీన్‌ బైక్‌పై వెళ్తూ ఢీకొట్టారు. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు.


logo