గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 01, 2020 , 00:29:57

గోదావరి జలాలతో రైతుల్లో నూతనోత్తేజం

గోదావరి జలాలతో రైతుల్లో నూతనోత్తేజం

  • కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాకు పూర్వవైభవం
  • 8,85,656 ఎకరాలు సస్యశ్యామలం

కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాకు పూర్వ వైభవం రానున్నది. సీఎం కేసీఆర్‌ అపరభగీరథ ప్రయత్నంతో ఎక్కడో పారుతున్న గోదారమ్మ అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌ మీదుగా ఎంతో ఎత్తులో ఉన్న కొండపోచమ్మసాగర్‌కు వచ్చింది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలు కలుపుకొని మొత్తం 8,45,656 ఎకరాలు, సింగూరు ప్రాజెక్టు కింద 40వేల ఎకరాలకు సాగు నీరందనుండగా, మెతుకు సీమ సస్యశ్యామలం కానున్నది. పడావు భూములనూ గోదారమ్మ పచ్చగా మార్చనున్నది. ఇన్నాళ్లు సాగునీరు లేక ఇబ్బందులు పడ్డ రైతాంగం, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను చూసి ఆనందపడుతున్నది. నూతనోత్తేజంతో సాగుకు సిద్ధమవుతున్నది. 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ అపరభగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదారమ్మ సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌కు చేరింది. మే 29న కొండపోచమ్మసాగర్‌ జలాశయంలో సీఎం కేసీఆర్‌ గోదావరి నీళ్లను విడుదల చేయగా, రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలు కలుపుకొని మొత్తం 8,45,656 ఎకరాలు, సింగూరు ప్రాజెక్టు కింద 40వేల ఎకరాలకు సాగు నీరందనున్నది. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ నేత సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. గలగల పారేటి గోదావరి నీళ్లను బీడు భూములకు మళ్లించారు. నీటి పారుదల రంగానికి భారీ స్థాయిలో నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించారు. ఎక్కడో పారుతున్న  గంగమ్మను 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మెతుకు సీమలో గోదావరి జలాలు పారి, పచ్చని పంటలతో మెతకు సీమ వర్ధిల్లనున్నది.

కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు నూతనోత్తేజం ..

కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల్లో నూతనోత్తేజం వచ్చింది. సాగునీరు లేక రైతులు ఇన్నాళ్లు అల్లాడిపోయారు. ఎక్కడో పారుతున్న గోదారమ్మను అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌ మీదుగా ఎంతో ఎత్తులో ఉన్న కొండపోచమ్మ వరకు నీళ్లు తీసుకొచ్చిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌. రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ మా రైతులకు దేవుడంటున్నారు. ఇన్నాళ్లు రైతుల కోసం ఎవరు కూడా ఆలోచించలేదు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి సీఎం కేసీఆర్‌ వెన్నుదన్నుగా నిలిచారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మకు గోదావరి జలాలు వస్తుండడంతో కాల్వల ద్వారా చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండి, వాటి పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగనున్నాయి. భవిష్యత్‌లో చెంబుతో నీళ్లు ముంచుకునే రోజులు దగ్గర్లో ఉంటాయని రైతులు ఆనందపడుతున్నారు. కొండపోచమ్మ గోదావరి జలాలు చూసి రైతులు సంతోషానికి అవధులు లేకుండాపోయింది. 

పడావు భూముల్లో ఇక సిరులు పంటలు..

నీళ్లు లేక పడావు భూముల్లో ఇక సిరుల పంటలు పండించవచ్చని రైతులు చెబుతున్నారు. నల్లరేగడి, ఎర్రనేలలు మంచి సారవంతమైన భూములున్నాయి. పంటలు పుష్కలంగా పండించవచ్చు. ఇన్నాళ్లు నీళ్లు లేక పడావు పెట్టి బతుకు కోసం వలస పోయిన రైతులు కాళేశ్వరం జలాలు రావడంతో ఆ రైతులంతా సొంతూళ్లలో చేతినిండా పని ఉంటదని తిరిగి వస్తున్నారు. వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న వేళ వలసపోయిన వారంతా వారి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. గోదావరి జలాలు చూసి సంబురంలో తేలియాడుతున్నారు. కాల్వల ద్వారా సాగు చేయడంతో ఏడాదికి మూడు పంటలు పండించుకోవచ్చు.

అలుగులు పారుతున్న చెరువులు ..

సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వల ద్వారా సుమారు 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం గొలుసుకట్టు విధానం ద్వారా చెక్‌డ్యాంలు, చెరువులను గోదావరి జలాలతో నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా రిజర్వాయర్‌ నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల, మానకొండూరు నియోజకవర్గంలోని చెరువులను, కుంటలను నింపుతున్నారు. కుడి కాల్వ ద్వారా 40 వేల ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా 70 వేల ఎకరాలు మొత్తం 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది. దీనితో సిద్దిపేట జిల్లాలో 56 గ్రామాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 29 గ్రామాల్లోని చెరువులను నింపనున్నారు. వీటిలో ప్రధానంగా పెద్దచెరువులు 245కు పైగా ఉన్నాయి. చిన్న చెరువులు సుమారుగా 200 వరకు ఉన్నాయి. వీటితో పాటు చెక్‌డ్యాంలు కూడా నింపుతున్నారు.

కొన్ని రోజులుగా రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వల ద్వారా సిద్దిపేట, మానకొండూరు నియోజకవర్గాల్లోని చెరువులను నింపుతున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని చేబర్తి చెరువులోకి నీటిని విడుదల చేశారు. ఆయా మండలాల్లోని పెద్దపెద్దచెరువులు మత్తళ్లు దుంకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. తద్వారా గజ్వేల్‌ నియోజకవర్గంలోని చెరువులను నింపనున్నారు. త్వరలో తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. శుక్రవారం నుంచి కొండపోచమ్మ ఒడిలోకి గోదావరి జలాలు వచ్చి చేరుతున్నాయి. ప్రారంభోత్సవం చేశాక 11 గంటల పాటు రెండు పంపులను నడిపించారు. దీంతో రిజర్వాయర్‌లోకి 0.1 టీఎంసీ నీళ్లు వచ్చి చేరాయి. logo