బుధవారం 30 సెప్టెంబర్ 2020
Siddipet - May 31, 2020 , 01:55:01

కాల్వల్లో ఈత కొట్టొద్దు

కాల్వల్లో ఈత కొట్టొద్దు

  • ‘కాళేశ్వరం’ కాల్వల్లో ఉధృత ప్రవాహం      
  • సరదా మాటున పొంచి ఉన్న ప్రమాదం 

కాళేశ్వరం కాలువల్లో గోదావరి నీళ్లు నిండుగా వేగంగా ప్రవహిస్తున్నాయి. పిల్లలు, మహిళలు ఈత రానివారు వివిధ రకాల పనుల కోసం, సరదా కోసం వెళ్తే ప్రమాదం పొంచి ఉన్నదని గుర్తించాలి. ఎండాకాలంలో కాలువల్లో నీళ్లు నిండుగా ఉండటంతో స్నానాలు చేస్తూ, బట్టలు ఉతుకుతూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా మర్కూక్‌లో ఇటీవలే ప్రస్తావిస్తూ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.   

గజ్వేల్‌ : జిల్లాలో కాళేశ్వరం కాలువలు వివిధ ప్రాంతాల్లో నిర్మాణం పూర్తికాగా నీటి ప్రవాహం కూడా ప్రారంభమైంది. రంగనాయకసాగర్‌ నుంచి మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ వరకు ప్రధాన కాలువలు పూర్తి కాగా నీటి ప్రవాహం కొనసాగుతున్నది. గంధమల్ల రిజర్వాయర్‌ వరకు కూడా ప్రధాన కాలువ ఉంది. వీటితో పాటు వివిధ ప్రాంతాలకు ఆయకట్టు కాలువల నిర్మాణం కొనసాగుతుండగా కొన్ని ప్రాంతాల్లో పూర్తి కావడంతో అధికారులు నీటిరి విడుదల చేస్తున్నారు. కాలువల పరీవాహక ప్రాంతాల్లో ఉన్నవారు కాలువల్లో ఉన్న నీటిలో  ఈత కొట్టడం, బట్టలు ఉతకడం మామూలైపోయింది. నీరు నిల్వ ఉన్న సమయంలో పెద్ద ఇబ్బంది లేకపోయినా నీటి ప్రవాహ సమయంలో ప్రమాదం పొంచి ఉంటుంది. ఆయకట్టు కాలువల్లో తక్కువ నీరు ప్రవహించడంతో పెద్ద ప్రమాదం ఉండకపోగా ప్రధాన కాలువల్లో ప్రమాదాలు ముంచుకువచ్చే అవకాశాలున్నట్లు కాళేశ్వరం ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. మల్లన్నసాగర్‌, తుక్కాపూర్‌ నుంచి కొడకండ్ల వరకు ప్రధాన కాలువల్లో 11500ల క్యూసెక్కుల నీరు ప్రవాహముండగా కొడకండ్ల నుంచి అక్కారం, మర్కూక్‌ వరకు కాలువల్లో 7500ల క్యూసెక్కుల నీరు నీటి ప్రవాహం ఉంటుంది. 

ప్రవాహంలో మరింత ప్రమాదం..

కాలువల్లో నీరు ప్రవహిస్తున్నప్పడు ఈత కొట్టడం, బట్టలు ఉతకడం ప్రమాదకరమని కాళేశ్వరం ఇంజినీరింగ్‌ అధికారులు సూచించారు. నీటి అవసరాన్ని బట్టి వివిధ సందర్భాల్లో ఒకటి నుంచి ఆరు మోటర్లను నడిపిస్తారు. ప్రస్తుతం 1, 2మోటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. కాలువల్లో ఈ రెండు మోటర్ల ద్వారానే ప్రవాహం ప్రమాదంగా మారింది. మరో నాలుగు మోటర్లు పనిచేస్తే నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటుందని, ప్రధాన కాలువల్లోకి దిగడం ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కాలువకు ఇరువైపులా కిందిభాగంలో సిమెంట్‌, కాంక్రిట్‌ చేయడం వల్ల చదునుగా ఉండి పట్టు తప్పుతుందని, నీళ్లలో పడిన వ్యక్తి నీటమునిగి కొట్టుకుపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. నీటి ప్రవాహాన్ని గుర్తించి కాలువల్లో స్నానాలు, బట్టలు ఉతకడం లాంటి పనులతో పాటు సరదాకు వెళ్లొద్దని చెబుతున్నారు. పిల్లలు కాలువల్లోకి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

గ్రామ సమీపంలో రక్షణ ఘాట్లు ఏర్పాటు ఆలోచన..

ప్రమాదాల నివారణ కోసం ముందుగా అప్రమత్తమై గ్రామాల సమీపంలో కాలువల్లో  స్నాన ఘాట్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచనలు చేశారు. ఘాట్లలో రక్షణ కోసం ఇరువైపులా ఇనుపచువ్వలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. జిల్లాలో నదీజలాలు కాలువల ద్వారా పారడంతో పిల్లలు, యువకులు సరదా కోసం కాలువల్లోకి దిగుతున్నారు. ప్రమాదాలు జరుగకుండా గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు తగిన చర్యలు చేపట్టడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది.


logo