మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - May 29, 2020 , 23:51:18

ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం

ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం

గజ్వేల్‌: వరద కాలువగా సాగుతున్న హల్దీవాగు కాళేశ్వరం నీటితో జీవనదిగా మారుతుందని తద్వారా ఉమ్మడి జిల్లాలోని అనేక మండలాల ఆయకట్టుకు సాగునీరు సమకూరుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు.  కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియంత్రిత సాగుకు అనుకూలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకమవుతున్న పల్లెల తీరును ఆయన ప్రశంసించారు. కొండపోచమ్మ ద్వారా ఉమ్మడి మెదక్‌ జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. సింగూరు లిఫ్ట్‌ పెట్టి నారాయణఖేడ్‌కు సాగునీళ్లు అందిస్తామని, మంజీరానదిపై 15చెక్‌డ్యాంలు, హల్దీవాగుపై మరో 5 చెక్‌డ్యాంలు నిర్మించడానికి నిధులు మంజూరయ్యాని తెలిపారు. 

నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది..

భూనిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌లో మామిడ్యాల, బైలంపూర్‌, తానేదార్‌పల్లి, తండా గ్రామాలు ముంపునకు గురయ్యామని, వారి త్యాగం వల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు సమకూరుతుందన్నారు. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి వారికి తగిన సహాయసహకారాలు అందించారని, నిర్వాసితుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తమన్నారు. త్వరలో గజ్వేల్‌కు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు రానున్నాయని, సిద్దిపేట జిల్లా ఫుడ్‌ప్రాసెసింగ్‌ సెజ్‌లలో కూడా వీరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. భూనిర్వాసితులపై ప్రభుత్వానికి సంపూర్ణ సానుభూతి ఉందని, వారి కోసం అన్నివిధాల సహకారాలు అందిస్తామని తెలిపారు. తున్కిబొల్లారం కాలనీ అన్ని సౌకర్యాలతో గేటెడ్‌ కమ్యూనిటీగా రూపుదిద్దుకుందన్నారు. గజ్వేల్‌ సమీపంలో కూడా 6వేల ఇండ్లను 600 ఎకరాల్లో నిర్మిస్తామని, దీంతో గజ్వేల్‌కు పక్కనే మరో కొత్త పట్టణంగా రూపుదిద్దుకుంటుందన్నారు. గజ్వేల్‌లో ఒక్క 400 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మించడానికి గత ప్రభుత్వాలకు 12 ఏండ్లు పట్టిందని, ఇప్పుడు గజ్వేల్‌లో అనేక సబ్‌స్టేషన్లు ఏడాదిలోపు నిర్మించామన్నారు. 

ఈత కొట్టొద్దు..

కాలువల్లో ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని సీఎం కేసీఆర్‌ సూచించారు. రాష్ట్రంలో కాళేశ్వరం కాలువ అత్యంత పెద్దదని, ఇందులో చిన్నపిల్లలు, మహిళలు, ఈతరాని వారు దిగడం ప్రమాదకరమన్నారు. తుక్కాపూర్‌ నుంచి వచ్చే కాలువ గంధమలకు, అక్కారం వెళ్లేందుకు రెండు కాలువలుగా మారుతుందని, అక్కడి వరకు ప్రవాహం ఒక టీఎంసీ ఉంటుందని తెలిపారు. అవసరం ఉన్న గ్రామాల వద్ద స్నాన ఘాట్లు కట్టించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 


logo