శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - May 28, 2020 , 23:39:44

జలపండుగ నేడే

జలపండుగ నేడే

ఉదయం 11.30గంటలకు సీఎం చేతుల మీదుగా కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవం

కరోనా వల్ల తప్పని కట్టుబాట్లు

సహకరించాలని ప్రజలకు మంత్రి హరీశ్‌రావు సూచన

గజ్వేల్‌ : ప్రపంచంలోనే లిఫ్టింగ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు చివరి దశ కొండపోచమ్మ రిజర్వాయర్‌ గొప్ప అధ్యాయాన్ని సృష్టిస్తున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గజ్వేల్‌ ఐవోసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును శుక్రవారం ఉదయం 11.30గంటలకు త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆశీస్సులతో సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో గొప్ప జలపండుగను ప్రజలు జరుపుకుంటారన్నారు.  ఉదయం కొండపోచమ్మ ఆలయం వద్ద చండీయాగం, రిజర్వాయర్‌ వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయన్నారు. సీఎం కేసీఆర్‌ దంపతులు ఉదయం చండీయాగంలో పాల్గొని పూర్ణాహుతులు నిర్వహిస్తారన్నారు. అనంతరం  ఎర్రవల్లి,  మర్కూక్‌ రైతువేదికలను ప్రారంభిస్తారన్నారు. అనంతరం మర్కూక్‌ పంప్‌హౌస్‌కు సీఎం దంపతులు చేరుకుంటారని తెలిపారు.10.25 నిమిషాలకు హెలికాప్టర్‌లో త్రిదండి చిన్నజీయర్‌స్వామి సుదర్శన యాగం వద్దకు చేరుకోగా..11.30 గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌ను చిన్నజీయర్‌స్వామి ఆశీస్సులతో ప్రారంభిస్తారన్నారు. 11.35 నిమిషాలకు కొండపోచమ్మ సాగర్‌ డెలివరీ సిస్టర్న్‌ల వద్దకు సీఎం కేసీఆర్‌ దంపతులు, చిన్నజీయర్‌ స్వామిలు వెళ్లి గోదావరి జలాలకు పూజలు నిర్వహిస్తారన్నారు.  అనంతరం  సీఎం  కేసీఆర్‌ మీడియా సమావేశంలో పాల్గొంటారన్నారు. 

సమన్వయంతో సహకరించండి

కరోనా వల్ల కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సాధారణ పద్ధతిలో నిర్వహిస్తున్నామని, పరిమితంగా ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే పాల్గొంటారన్నారు. గజ్వేల్‌ ప్రజలు మీడియా మిత్రులు సమన్వయంతో సహకరించాలని కోరారు. కరోనా వల్ల తక్కువ మందికే పరిమితం చేస్తున్నట్లు చెప్తూ కొండపోచమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిండుమనసుతో స్వాగతించాలని కోరారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి,  కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, గడాఓఎస్డీ ముత్యంరెడ్డి పాల్గొన్నారు. 

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు..

సీఎం పర్యటన సందర్భంగా మర్కూక్‌, వర్ధరాజ్‌పూర్‌, తీగుల్‌ నర్సాపూర్‌ ప్రాంతాల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటించి గురువారం పరిశీలించారు. వర్ధరాజ్‌పూర్‌ ఆలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సందర్భంగా అక్కడి ఏర్పాట్లను చూసి పలు సూచనలు చేశారు. అనంతరం  కొండపోచమ్మ ఆలయం వద్ద చండీయాగం ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మర్కూక్‌ వద్ద కొండపోచమ్మ రిజర్వాయర్‌ వద్ద సుదర్శన యాగం ఏర్పాట్లు పరిశీలించారు. రిజర్వాయర్‌ వద్ద వీవీఐపీల సమావేశం, మీడియా సమావేశం, పంప్‌హౌస్‌ ప్రారంభోత్సవ పనులను పరిశీలించారు.


logo