శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - May 28, 2020 , 23:36:06

కొండపోచమ్మ ఒడిలోకి గోదావరి జలాలు

 కొండపోచమ్మ ఒడిలోకి గోదావరి జలాలు

 • ఉదయం 11.30 గంటలకు మర్కూక్‌ పంపుహౌస్‌ను ప్రారంభించనున్నసీఎం కేసీఆర్‌
 • ప్రారంభోత్సవానికి హాజరు కానున్న చినజీయర్‌ స్వామి 
 • కొండపోచమ్మ ఆలయం వద్ద చండీయాగం 
 • మర్కూక్‌ పంపుహౌస్‌ వద్ద సుదర్శనయాగం
 • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కేపీఆర్‌
 • కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 

కాళేశ్వరం ప్రాజెక్టు శిఖరాయమానమైన ఘట్టం నేడు ఆవిష్కృతం కానున్నది. పల్లం నుంచి పైపైకి ఎగబాగుతూ గోదావరమ్మ ‘కొండ’ ఎక్కనున్నది. దీనికి సీఎం కేసీఆర్‌ అంకురార్పణ చేయనుండగా, అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది.శుక్రవారం ఉదయం 11.30గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌లో నుంచి ముఖ్యమంత్రి దంపతులు గోదావరి జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి విడుదల చేయనున్నారు. మొదటగా జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌నర్సాపూర్‌ కొండపోచమ్మ దేవాలయంలో సీఎం కేసీఆర్‌ దంపతులు చండీయాగంలో పాల్గొంటారు. అనంతరం మర్కూక్‌ పంప్‌హౌస్‌కు చేరుకొని, సుదర్శనయాగం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఆ తర్వాత పంప్‌హౌస్‌లో పూజలు చేసి, మోటర్లను ఆన్‌ చేసి, నీళ్ల ఎత్తిపోతను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్‌ డిస్‌చార్జి కెనాల్‌ వద్దకు చేరుకొని, రిజర్వాయర్‌లోకి వస్తున్న గోదావరి జలాలకు పూజలు చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై గురువారం గజ్వేల్‌లో మంత్రి హరీశ్‌రావు అధికారులతో చర్చించిన అనంతరం, కొండపోచమ్మ దేవాలయం, మర్కూక్‌ పంపుహౌస్‌ వద్ద ఏర్పాట్లను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల అశోక్‌తేజ, ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

గజ్వేల్‌/ గజ్వేల్‌అర్బన్‌/ మర్కూక్‌  : కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మర్కూక్‌ వద్ద రిజర్వాయర్‌ సమీపంలో పంప్‌హౌస్‌ వద్ద ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. త్రిదండి చిన్నజీయర్‌స్వామి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావుతో పాటు మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు పాల్గొనున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో పరిమిత జనాన్ని ఆహ్వానించడం వల్ల కార్యక్రమానికి సహకరించాలని మంత్రి హరీశ్‌రావు ఐవోసీలో ఏర్పాటు చేసిన సమీక్షలో సూచించారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు ఉదయం 11.30గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తారన్నారు. 

 1. ఉదయం 6.45గంటలకు సీఎం తమ కుటుంబసభ్యులతో ఫామ్‌హౌస్‌ నుంచి బయలుదేరి వయా గణేశ్‌పల్లి, ప్రజ్ఞాపూర్‌  ఎక్స్‌ రోడ్‌, కొడకండ్ల సబ్‌స్టేషన్‌ నుంచి  చిన్న కిష్టాపూర్‌ మీదుగా కొండపోచమ్మ  ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే చండీహోమంలో పాల్గొని 7.30కి కొండపోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి తిరిగి ఫామ్‌హౌస్‌కు చేరుకుంటారు. 
 2. అనంతరం 9.35గంటలకు మర్కూక్‌,  గంగాపూర్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద రైతువేదిక  భవనాలకు భూమిపూజ చేస్తారు. 
 3. 9.50గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌ వద్ద చిన్నజీయర్‌ స్వామితో కలిసి సుదర్శనయాగంలో పాల్గొంటారు.
 4. 11.30గంటలకు పంప్‌హౌస్‌లో స్విచ్‌ ఆన్‌ చేసి రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేస్తారు.
 5. 11.35 గంటలకు పంప్‌హౌస్‌ నుంచి  కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టు కట్టపైకి  చేరుకుని అక్కడ పూజలు చేసి జలహారతి  ఇస్తారు.
 6. 12 గంటలకు వర్ధరాజ్‌పూర్‌ దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. సీఎంతో పాటు చిన్నజీయర్‌స్వామి, మంత్రి ఇంద్రకరణ్‌  పాల్గొంటారు.
 7. 12.40గంటలకు రిజర్వాయర్‌ సమీపంలోఏర్పాటు చేసిన వీవీఐపీలు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. తర్వాత అక్కడ  ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పాల్గొంటారు. 

సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ..

 • జిల్లా పోలీసు సిబ్బందికి విధులను నిర్దేశించిన  సీపీ జోయల్‌డెవిస్‌
 • ప్రతి ఒక్కరూ శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్‌లను ధరించాలి
 • 2220మంది బందోబస్తును 17సెక్టార్లుగా విభజించిన సీపీ

కొండపోచమ్మ రిజర్వాయర్‌ను శుక్రవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తుండటంతో  కార్యక్రమ నిర్వహణకు పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌డెవిస్‌ తెలిపారు. గురువారం గజ్వేల్‌ ప్రజ్ఞా గార్డెన్‌తో పాటు గౌరారంలోని మోహన్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో పోలీసు సిబ్బందితో సమావేశాలు నిర్వహించి శుక్రవారం నిర్వహించే విధి నిర్వహణకు సంబంధించి దిశానిర్ధేశం చేశారు. మొత్తం 2220మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని, శుక్రవారం ఉదయం 5గంటలు పూర్తి యూనిఫాంలో తమకు కేటాయించిన ప్రాంతంలో హాజరు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులను ధరించాలన్నారు.

2220మంది పోలీసులతో బందోబస్తు..

కొండపోచమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 2220మంది పోలీసు అధికారులు, సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. శుక్రవారం కార్యక్రమంలో బందోబస్తును 17 సెక్టార్లుగా విభజించారు. అడిషనల్‌ ఎస్పీలు ముగ్గురు, ఏసీపీ/డీఎస్పీలు 14, సీఐలు - 48, ఎస్సైలు 112, ఏఎస్సైలు/హెడ్‌ కానిస్టేబుళ్లు 158, కానిస్టేబుళ్లు/ హోంగార్డులు 702, మహిళా కానిస్టేబుళ్లు/ మహిళా హోంగార్డు -46, స్పెషల్‌ పార్టీస్‌/రోప్‌ పార్టీస్‌/ బీడీ టీమ్స్‌/డాగ్‌స్కాడ్‌/సెక్యూరిటీ వింగ్‌, మఫ్టీ పార్టీ మొత్తం 1120 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్‌ తెలిపారు. 

ట్రాఫిక్‌ డైవర్షన్‌ పాయింట్లు..

కార్యక్రమానికి తరలివచ్చే ప్రజాప్రతినిధులు, అధికారుల వాహనాల పార్కింగ్‌కు, ట్రాఫిక్‌ డైవర్షన్‌కు ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ డైవర్షన్‌కు గౌరారం ఎక్స్‌ రోడ్డు, మామిడ్యాల కమాన్‌, భవానందాపూర్‌ ర్యాంపుల వద్ద ట్రాఫిక్‌ డైవర్షన్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. అలాగే వీవీఐపీ భోజనాలు చేసే పక్కనే వీవీఐపీ వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. వీఐపీ, ప్రెస్‌, పోలీస్‌ వాహనాలకు పంప్‌హౌస్‌ ఎదురుగా ఉన్న మామిడి తోట పక్కన ఉన్న బహిరంగ ప్రదేశంలో వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఎవరూ కూడా వాహనాలను రోడ్డు పక్కన ఆపకుండా, ప్రతిఒక్కరూ పార్కింగ్‌ ప్రదేశాల్లోనే పార్క్‌ చేసుకుని వారికి కేటాయించిన ప్రదేశాలకు వెళ్లాలని సీపీ జోయల్‌డెవిస్‌ సూచించారు. logo