శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - May 28, 2020 , 23:22:08

మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు

మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీరు

  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌ : ఆడబిడ్డ నీటి కోసం బిందె పట్టుకుని గడపదాటొద్దనే సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువు సమీపంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన మిషన్‌ భగీరథ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కార్యాలయాన్ని ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, ఫారూఖ్‌హుస్సేన్‌, రఘోత్తంరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కృపాకర్‌, సీఈ చక్రవర్తి, ఎస్‌ఈ శ్రీనివాస్‌చారిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ తాగునీటి సమస్యను తరిమేద్దామని చెప్పారు. 

మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ద్వారా ప్రతి మనిషికి 100 లీటర్ల తాగునీరును ప్రతి నిత్యం ఇవ్వాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతి ఆదివారం ఏఈలు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి లాంగ్‌షీట్‌ పంపిన తరువాత అధికారులను ఫీల్డ్‌కి పంపాలని సూచించారు. జిల్లా డివిజన్‌ స్థాయిలో ఈఈలు లాంగ్‌షీట్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 27 గ్రామాల్లో, మున్సిపాలిటీల పరిధిలో ప్రతి మంగళవారం లాంగ్‌షీట్లు ఈఎన్‌సీ కార్యాలయానికి అందేలా చర్యలు చేపట్టినట్లు ఈఎన్‌సీ కృపాకర్‌ మంత్రికి వివరించారు. లాంగ్‌షీట్‌లో 7 మంది సంతకాలు పెట్టాలని, అందులో సర్పంచు, కార్యదర్శులు నీళ్లు వచ్చాయా లేదా అన్నది సంతకం చేయాల్సి ఉంటుందని మంత్రికి వివరించారు. ఎక్కడా లీకేజీలు ఉండవద్దని, నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ మేరకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్లకు, సైట్‌ ఇన్‌స్పెక్టర్లకు మెమోంటో, ప్రశంసాపత్రాలని మంత్రి అందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు రాజయ్య, నాగభూషణం పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo