గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - May 28, 2020 , 00:08:27

మహోత్తర ఘట్టానికి వేళాయె!

మహోత్తర ఘట్టానికి వేళాయె!

  • కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
  • పర్యవేక్షించిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ  కొత్త ప్రభాకర్‌రెడ్డి
  • పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు

కొండపోచమ్మ రిజర్వాయర్‌ ్రప్రారంభించేందుకు శుక్రవారం సీఎం కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపోచమ్మ ఆలయ ఆవరణలో , పంప్‌ హౌస్‌ వద్ద యాగాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంతో ఇతర ప్రముఖులకు ఇబ్బంది కలుగకుండా వసతులు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రిహరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తదితరులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కరోనా నేపథ్యంలో ఉన్న ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని పోలీసు  అధికారులు పటిష్ట  బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ఆలయ, ్రప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. కాళేశ్వర ప్రాజెక్టులో ప్రధాన ఘట్టమైన కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం కనుల పండవలా నిర్వహించేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. కాళేశ్వర కలను నిజం చేసి ఉమ్మడి మెదక్‌ జలకళను తీసుకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు మెతుకుసీమ వాసులు నీరాజనాలు పలుకుతున్నారు.

మర్కూక్‌: కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు మర్కూక్‌ వద్ద జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఉదయం 11.30గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌లో మోటర్లను ప్రారంభించి, కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేస్తారు. ముందుగా ఉదయం 4గంటలకు కొండపోచమ్మ పుణ్యక్షేత్రంలో చండీయాగం, మర్కూక్‌ పంప్‌హౌస్‌ వద్ద సుదర్శన యాగం ఏకకాలం రుత్వికులు నిర్వహిస్తారు. 7.45 గంటలకు చండీయాగంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొని, 10గంటల సమయంలో పంప్‌హౌస్‌ వద్దకు చేరుకుని చిన్నజీయర్‌స్వామి ఆశీస్సులతో సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం మర్కూక్‌ పంప్‌హౌస్‌లోని మోటర్లను స్విచ్‌ఆన్‌ చేసి గోదావరి నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. అక్కడి నుంచి సీఎం దంపతులు, చిన్నజీయర్‌ స్వామి ప్రత్యేక వాహనాల్లో కొండపోచమ్మ ప్రాజెక్టు డిస్‌చార్జి కెనాల్‌ వద్దకు చేరుకుని గోదావరి జలాలకు స్వాగతం పలుకుతారు. ఎర్రవల్లి, మర్కూక్‌లో రైతుబంధు వేదికలకు శంకుస్థాపన కూడా చేస్తారు.

ఏర్పాట్లను పరిశీలించిన  మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కేపీఆర్‌

కొండపోచమ్మసాగర్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి బుధవారం సాయంత్రం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్‌ పాల్గొనే పలు కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను విడివిడిగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. యాగశాల, భోజనశాల, విశ్రాంత కుటీరాల నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో మాట్లాడారు. పంప్‌హౌస్‌కు వెళ్లి పంపుసెట్ల పనితీరు, ఇతర అంశాలను ఇంజినీరింగ్‌ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న పంపుసెట్లు, ఇతర అంశాలపై అధికారులు పూర్తి వివరాలను మంత్రి హరీశ్‌రావుకు తెలియజేశారు. పంపుహౌస్‌ వద్ద సుదర్శనయాగం ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఇంకా సీఎం కేసీఆర్‌ దంపతులు, చిన్నజీయర్‌ స్వామి పాల్గొనున్న పలు కార్యక్రమాల వివరాలను, అందుకు అవసరమైన ఏర్పాట్ల వివరాలను, అధికారులతో చర్చించారు. 

ముమ్మరంగా ఏర్పాట్లు 

మర్కూక్‌ రిజర్వాయర్‌ సమీపంలో పంప్‌హౌస్‌ వద్ద భూమిని చదును చేస్తున్నారు. రిజర్వాయర్‌ నుంచి మర్కూక్‌ పంప్‌హౌస్‌ వరకు రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. పంప్‌హౌస్‌, సిస్ట ర్న్స్‌, ఇతర ప్రాంతాల్లో రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. కట్టపై పారిశుధ్య పనులు, వీధిదీపాల ఏర్పాట్లు చేపడుతున్నారు. కార్యక్రమాలకు హాజరయ్యే వీఐపీలు, మీడియా ప్రతినిధుల కోసం షామియానాలను సిద్ధం చేస్తున్నారు. 

భారీ బందోబస్తు

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మర్కూక్‌ కొండపోచమ్మ రిజర్వాయర్‌ సమీపంలో భారీ బందోబస్తును మోహరిస్తున్నారు. ఐజీ ఎంకే సింగ్‌ ఆధ్వర్యంలో సీపీ జోయల్‌ డెవిస్‌ పర్యవేక్షణలో ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడమే కాకుండా జాగిలాలు, ఇతర పరికరాలతో తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సీఎం ప్రత్యేక కార్యదర్శి పరమేశ్వర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ ఖాన్‌, ఈఎన్సీ హరిరాం, దేవేందర్‌రెడ్డి, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాదాసు శ్రీనివాస్‌, కరుణాకర్‌రెడ్డి, గుండారంగారెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, గడా ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. logo