మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - May 26, 2020 , 01:22:18

గాలివాన బీభత్సం

 గాలివాన బీభత్సం

  • విరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు... దెబ్బతిన్న ఫౌల్ట్రీ ఫాంలు 

సిద్దిపేట అర్బన్‌ : గాలి దుమారానికి చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుమీద పడ్డ సంఘటన సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సోమవారం వీచిన గాలిదుమారానికి ఎన్సాన్‌పల్లి  నుంచి తొగుట వెళ్లే రహదారిపై పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్‌ ఎస్సై శంకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు, యువకులు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా విరిగిపడ్డ చెట్లు, విద్యుత్‌ స్తంభాలను తొలగించారు.  

కొట్టుకుపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌

కొండపాక : కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మర్పడగ నుంచి ఖమ్మంపల్లి వెళ్లే రహదారి పక్కన ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కొద్ది దూరం కొట్టుకుపోయింది. రెండుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలాయి. మర్పడగ, సిర్సినగండ్ల గ్రామాల్లో పలు ఇండ్ల పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి.  

కోళ్లఫాం ధ్వంసం

గజ్వేల్‌ రూరల్‌ : మండలంలోని పిడిచెడ్‌లో సోమవారం సాయంత్రం వీచిన గాలి దూమారానికి జీడిపల్లి సంజీవరెడ్డికి చెందిన కోళ్లఫాం ధ్వంసమైంది. కోళ్లపై రేకులు పడటంతో కొన్ని కోళ్లు మృతి చెందాయి. 

తొగుట, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లో...

తొగుట/కొమురవెల్లి/మద్దూరు : తొగుట మండలంలో గాలివానకు నష్టం వాటిల్లింది. కాన్గల్‌ మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు బాసిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫాం రేకులు కొట్టుకుపోయాయి. తుక్కాపూర్‌లో చెరుకు నరేశ్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫాం నేలమట్టమైంది. వెంకట్‌రావుపేటలో పాఠశాలలో ఉన్న భారీ వృక్షం కూలింది.  తొగుట, తుక్కాపూర్‌, వెంకట్‌రావుపేట, వాగ్గడ్డ, ఎల్లారెడ్డిపేట, రాంపూర్‌, జప్తిలింగారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 40 విద్యుత్‌  స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది.  కొమురవెల్లి మండలం గురువన్నపేట, తపాస్‌పల్లి, ఐనాపూర్‌, పోసాన్‌పల్లి గ్రామాల్లో సోమవారం సాయంత్రం గాలివాన కురిసింది. గురువన్నపేటలో ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు మూడు కరెంట్‌ స్తంభాలు కూలాయి. మద్దూరు మండల కేంద్రంతో పాటు నర్సాయపల్లి, గాగిళ్లాపూర్‌, వల్లంపట్ల, కూటిగల్‌ తదితర గ్రామాల్లో విద్యుత్‌ తీగలు తెగిపడటంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 

గోదాంను పరిశీలించిన జేసీ పద్మాకర్‌

తొగుట : గాలివాన మూలంగా తొగుటలోని సివిల్‌ సప్లయ్‌ గోదాంలో కొంత భాగం కూలిపోవడంతో జేసీ పద్మాకర్‌ సోమవారం రాత్రి పరిశీలించారు. బియ్యం స్టాక్‌ను భద్రపర్చాలని తహసీల్దార్‌ బాల్‌రెడ్డిని ఆదేశించారు. వేములఘాట్‌లో సర్పంచ్‌ సిద్దిపేట బాలయ్యకు చెందిన కోళ్లఫాం పూర్తిగా దెబ్బతిన్నది.


logo