గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - May 26, 2020 , 01:12:09

సీఎం చెప్పిన పంటే సాగుచేస్తాం..

సీఎం చెప్పిన పంటే సాగుచేస్తాం..

  • ఉత్సాహంగా ప్రతిజ్ఞలు చేస్తున్న రైతన్నలు
  • సిద్దిపేట జిల్లాలో 104, మెదక్‌ జిల్లాలో 28 గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. రైతుబంధు, రైతుబీమాతో పాటు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందించింది. అర్హత ఉన్నవారందరికీ రుణమాఫీని చేస్తుంది. సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం చేసి జిల్లాకు గోదావరి జలాలు తీసుకవచ్చి చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపుతున్నారు. దీంతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తామంటూ జిల్లాలోని పలు గ్రామాల రైతులు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అందిస్తున్నారు. 

రెండు రోజులుగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఊరూరా ఏకగ్రీవ తీర్మానాల జోరు కొనసాగుతుంది. జిల్లాలో జరిగిన సమావేశాల్లో దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్‌ మండలం నర్సంపల్లిలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని కోహెడ మండలం బస్వాపూర్‌లో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ పాల్గొన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని జగదేవ్‌పూర్‌ మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఏకగ్రీవ తీర్మానాలు చేసిన  కాపీలను జగదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్‌ పి.వెంకట్రామ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్‌ కుమార్‌లకు అందించారు. సిద్దిపేట అర్బన్‌ మండలం అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌ పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తామంటూ ప్రతీన బూనారు. 

సిద్దిపేట జిల్లాలో రెండోరోజు 104 గ్రామాలు.. 

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రెండోరోజు నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తామంటూ గ్రామాలకు గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. సోమవారం గజ్వేల్‌ నియోజకవర్గంలో - 61,  సిద్దిపేట నియోజకవర్గంలో- 17, దుబ్బాక నియోజకవర్గంలో -18, హుస్నాబాద్‌ నియోజకవర్గంలో-7, జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో-1 కలిపి మొత్తం 104 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.

కాగా సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలో రెండు రోజుల్లోనే తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల్లో  మొత్తం 149 గ్రామాల్లో రైతులు తీర్మానాలు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో-25, దుబ్బాకలో-23, హుస్నాబాద్‌లో-7, చేర్యాలలో-1 మొత్తం 177  గ్రామాల్లో రైతులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 75 గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేయగా,  ఆ  సంఖ్య సోమవారానికి 207కి పెరిగింది. రెండోరోజు సిద్దిపేట జిల్లాలో 104 గ్రామాలు, మెదక్‌ జిల్లాలో 28 గ్రామాలు, మొత్తం         132 గ్రామాల రైతులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.


logo