సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - May 24, 2020 , 01:33:42

పైసలొచ్చినయ్‌

 పైసలొచ్చినయ్‌

  • రూ.25 వేల లోపు రుణం ఉన్న రైతులకు ఏకకాలంలో...
  •  తొలివిడుతలో ఉమ్మడి జిల్లాలో 62,746 మందికి రుణమాఫీ
  • అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ  

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్నది. తొలి విడుతలో ఉమ్మడి జిల్లాలో 62,746 మందికి ఒకేసారి రుణమాఫీ అమలవుతుంది. కుటుంబం యూనిట్‌గా రూ.25 వేలలోపు రుణం ఉన్న రైతులకు ఏకకాలంలో మాఫీ చేస్తున్నారు. తొలివిడుతలో సిద్దిపేట జిల్లాలో 20,146 మంది రైతులకు రూ. 271 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 20,503 మంది రైతులకు రూ.305 కోట్లు, మెదక్‌ జిల్లాలో 22,097 మంది రైతులకు రూ. 341 కోట్లు అవసరమవుతాయి. ఈ మేరకు డబ్బులు రావడంతో రైతుల ఖాతాలో నేరుగా జమ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. 

 సిద్దిపేట, నమస్తేతెలంగాణ :రుణమాఫీ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 1,67,771 మంది, సంగారెడ్డి జిల్లాలో 1,90,002 మంది, మెదక్‌ జిల్లాలో 1,53,883 మంది రైతులకు రుణమాఫీ వర్తించనున్నది. ఇందుకు గాను సిద్దిపేటకు రూ.1074కోట్లు, సంగారెడ్డికి రూ.1297కోట్లు, మెదక్‌కు రూ. 914కోట్లు అవసరం కానున్నాయి. ఈ మేరకు తొలి విడుత రూ. 25వేల లోపు రుణం ఉన్న వారికి ఏకకాలంలో మాఫీ చేస్తున్నారు. మిగతావి నాలుగు విడుతల్లో జమ కానున్నాయి.  కరోనా, లాక్‌డౌన్‌ అమలవుతున్న తరుణంలో రైతులకు ఈ రుణమాఫీ ఊరటనిచ్చిందనే చెప్పాలి.  

తొలి విడుతలో ఉమ్మడి జిల్లాలో 62,746 మందికి రుణమాఫీ..

తొలి విడుతలో ఉమ్మడి జిల్లాలో 62,746 మందికి ఒకేసారి రుణమాఫీ అమలవుతున్నది. రూ.25వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాలో జమవుతున్నాయి.  దీంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలివిడుతలో జిల్లాల వారీగా సిద్దిపేటలో 20,146 మంది రైతులకు రూ.271కోట్లు, సంగారెడ్డిలో 20,503 మంది రైతులకు గాను రూ.305కోట్లు, మెదక్‌లో 22,097 మంది రైతులకు గాను రూ.341కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమవుతున్నట్లు అధికారులు తెలిపారు. వానకాలం రైతుబంధు త్వరలోనే విడుదల కానున్నది. ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేలను అందిస్తున్నది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. తుంపర సేద్యాన్ని ప్రోత్సహించడానికి రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు అందిస్తున్నది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఎరువులు సరఫరా చేసింది.


రూ.25 వేల లోపు ఒకేసారి మాఫీ

రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి నిధులను విడుదల చేసింది. రూ.25వేల లోపు రుణం ఉన్న వారికి ఏకకాలంలో మాఫీ చేస్తుంది. సిద్దిపేట జిల్లాలో 20,146 మంది రైతులకు తొలి విడుతలో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. మిగిలిన రైతులకు విడుతల వారీగా వారి ఖాతాల్లో  జమవుతాయి. ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులు నియంత్రిత పద్ధ్దతిలో సాగు చేయాలి.

- శ్రవణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  


logo