శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - May 19, 2020 , 23:33:58

ప్రయాణం ప్రారంభం

ప్రయాణం ప్రారంభం

  • రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
  • భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరి
  • ఉమ్మడి జిల్లాలో ఎనిమిది ఆర్టీసీ డిపోలు, 627 బస్సులు
  • ప్రయాణికులకు సేవలందించిన 285 బస్సులు
  • బస్సుల్లో అందుబాటులో శానిటైజర్‌

సంగారెడ్డిప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్‌డౌన్‌తో 56 రోజుల తరువాత బస్సులు ప్రయాణికులకు తిరిగి సేవలందించాయి. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా బస్సులు నడుపుకోవచ్చునని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బస్సులు తిరిగాయి.  అన్ని బస్సుల్లో శానిటైజర్‌ అందుబాటులో ఉంచగా డ్రైవర్‌, కండక్టర్లతో పాటు ప్రయాణికులు మాస్క్‌లు ధరించి కనిపించారు.  

స్పెషల్‌ బస్సులు కూడా...

మొదటిరోజు ఉమ్మడి జిల్లా పరిధిలో ఆయా డిపోల నుంచి సాధారణ బస్సులతో పాటు స్పెషల్‌ బస్సులు కూడా నడిపారు. ఉమ్మడి జిల్లాలో ఎనిమిది డిపోల పరిధిలో 627 బస్సులకు గాను మొదటి రోజు 26 స్పెషల్‌ సర్వీసులతో కలిపి 285బస్సులతో ప్రయాణికులకు సేవలందించారు. అన్ని డిపోల నుంచి సికింద్రాబాద్‌కు బస్సులు నడిపారు. ఉమ్మడి జిల్లా నుంచి నిజామాబాద్‌ జిల్లా బిచ్‌కుందా, యాదగిరిగుట్ట, వరంగల్‌, కరీంనగర్‌, సిద్దిపేట, మెదక్‌ ప్రాంతాలకు బస్సులు నడిచాయి. బస్సు ఎక్కే సమయంలోనే ప్రయాణికులకు శానిటైజర్‌ అందించారు. ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరు, ఇద్దరు కూర్చునే సీటులో ఒక్కరిని కూర్చోబెట్టినట్టు ఆర్టీసీ మెదక్‌ రీజినల్‌ మేనేజర్‌ రాజశేఖర్‌ తెలిపారు. మాస్క్‌లు ధరించిన వారినే బస్సులోకి అనుమతిస్తున్నట్టు చెప్పారు. 56 రోజుల తరువాత బస్సులు నడవడం, మంగళవారం కావడంతో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నదని,  బుధవారం నుంచి సంఖ్య పెరిగే అవకాశమున్నదని ఆర్‌ఎం అభిప్రాయపడ్డారు. 

మాస్క్‌ ధరిస్తేనే అనుమతి 

కరోనాతో జాగ్రత్తగా ఉంటూనే ముందుకెళ్లాల్సిన సమయమిది. ప్రయాణాలు చేసే వారు విధిగా మాస్క్‌లు ధరించాలి. లేకుంటే బస్సులోకి అనుమతించం. కరోనాతో పోరు జరుపుతూ నివారణకు కృషి చేయాలి. బస్సు ఎక్కే వారు దిగే వారు భౌతిక దూరం పాటించాలి. ఆర్టీసీ బస్సులు తిరిగి రోడ్డెక్కడం ఆనందంగా ఉంది. 

- పద్మ, కండక్టర్‌, సిద్దిపేట

సంతోషంగా ఉంది 

బస్సు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. నమ్మకానికి మారుపేరుగా ఆర్టీసీ నిలుస్తున్నది. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా ప్రభుత్వం బస్సులను నడుపడం ఆనందంగా ఉంది. మొన్నటి వరకు ఎక్కడి వెళ్లాలన్న ఇబ్బంది పడ్డాం. తిరిగి బస్సులు నడుస్తుండడంతో బంధువులను కలిసేందుకు వెళ్తున్న.

- ప్రసాద్‌, ప్రయాణికుడు

56 రోజులు తర్వాత..

56రోజులు తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కడంతో మా కష్టాలు తొలగిపోయాయి. నేను పాపన్నపేటలో ఉద్యోగం చేస్తున్నా. మెదక్‌ నుంచి రోజు అక్కడికి వెళ్లాలంటే సమయం వృథా అయ్యింది. రోజుకు రూ.200 ఖర్చుఅయ్యింది. బస్సులు నడవడంతో సంతోషంగా ఉంది.

- జబ్బార్‌ఖాన్‌, కాంట్రాక్టు ఉద్యోగి, మెదక్‌

మా ఇంటికి వెళ్తున్నాం.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసి బస్సులకు సడలింపు ఇవ్వడంతో సంతోషంగా మా ఇంటికి వెళ్తున్నాం. మేము మా బంధువుల పెండ్లి ఉండడంతో నర్సాపూర్‌ నుంచి మెదక్‌ వచ్చి, ఇక్కడే ఉండిపోయాం. ఆర్టీసి బస్సులు నడవడంతో తిరిగి మా గ్రామం నర్సాపూర్‌కి వెళ్తున్నాం.

- లక్ష్మీ, నర్సాపూర్‌, మెదక్‌

నాకు ఆనందంగా ఉంది

ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో అత్యవ సరంగా ఎక్కడికి ప్రయాణం చేయాలన్న ఇబ్బందులు పడ్డాం. ప్రైవేటు వాహనం తీ సుకెళ్తే రూ.2వేలు ఖర్చయ్యేది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. బస్సులు నడవడంతో నేను ఈ రోజు సిద్దిపేట వెళ్తున్నా. నాకు ఆనందంగా ఉంది.

- రంజిత్‌కుమార్‌, మెదక్‌

కరోనా భయం పోలేదు..

కరోనా మహమ్మారి భయం ప్రజల్లో నుంచి పోలేదు. అందుకే బస్సులు నడుస్తున్నా, ప్రయాణం చేయడానికి ప్రజలు రావడంలేదు. ప్రభుత్వం ప్రజల రవాణాకు అన్ని ఏర్పాట్లు చేసిన భయంతోనే ప్రయాణం చేయడానికి ఆసక్తి కబర్చడంలేదు. ప్రజలు భయాన్ని వీడి, బస్సుల్లో ప్రయాణం చేసి, ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించండి.

- కిషన్‌, కండక్టర్‌, నారాయణఖేడ్‌ డిపో

ప్రయాణికులు లేరు..

బస్సులు నడుస్తున్నాయని బస్టాండ్‌కు వచ్చా. పని మీద పటాన్‌చెరు వెళ్తున్న. అద్దగంట అయ్యింది. బస్సులు వేసిన ప్రయాణికులు లేకపోవడంతో ఆలస్యంగా వస్తున్నయ్‌. ముఖ్యంగా కరోనా కారణంగా ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. నాలుగైదు రోజుల్లో సరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుంది.

   - యాదగిరి ప్రయాణికుడు, సంగారెడ్డి


logo