సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - May 19, 2020 , 23:27:57

ఆరో విడుతలో కోటిన్నర మొక్కలు

ఆరో విడుతలో  కోటిన్నర మొక్కలు

  • హరితహారంలో సిద్దిపేట జిల్లానే ఆదర్శం 
  • పాత మొక్కలపైనా పక్కాగా సర్వే... 
  • జూన్‌ రెండో వారంలో కార్యక్రమం  
  • గుంతలు, మొక్కలు, ట్రీగార్డులు సిద్ధం చేయండి 
  • ప్రాజెక్టు కాల్వలకు ఇరువైపులా మొక్కలు నాటాలి 
  • నాటిన మొక్కల స్థితిగతులన్నీ ఆన్‌లైన్‌లో నమోదు 
  • ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: ‘రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో కోటి 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. హరితహారం కార్యక్రమానికే సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచింది. ఈ ఏడాది హరితహారంలోనూ జిల్లాను ముందంజలో నిలుపుదాం.. జూన్‌ రెండో వారంలో మొక్కలు నాటడాన్ని ప్రారంభించాలి. ఇందుకోసం ట్రీగార్డులు, మొక్కలు సిద్ధం చేసుకొని గుంతలు తీసే కార్యక్రమాన్ని ఉపాధిహామీ కూలీల ద్వారా చేపట్టాలి’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా హరితహారం యాక్షన్‌ ప్లాన్‌ 2020- 21పై సమీక్షా సమావేశాన్ని మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌, మండలి చీఫ్‌విప్‌ బోడెకుంటి వెంకటేశ్వర్లు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజామ్మిల్‌ఖాన్‌, డీఎఫ్‌వో శ్రీధర్‌, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావులతో కలిసి వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి, నీటి సరఫరాకు ఒక ట్యాంకర్‌, పంచాయతీ బడ్జెట్‌లో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ ఉండడం ఎక్కువ శాతం మొక్కలు నాటి, రక్షించాలని సూచించారు. గ్రామాల వారీగా అన్ని రహదారులు, కాల్వల పక్కన రెండు వైపులా నాలుగు వరుసల చొప్పున 8 లైన్ల మొక్కలు నాటాలని సూచించారు. గతంలో నాటిన మొక్కల సర్వే నిర్వహించి చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు ప్రతి గ్రామంలో ఎన్ని మొక్కలు కావాలో శనివారంలోపు డీఆర్డీఏ పీడీకి నివేదికలు సమర్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. అన్ని గ్రామాల్లోని నర్సరీల్లో జూన్‌ మొదటి వారంలోపు హరితహారంలో నాటే మొక్కలను సిద్ధం చేయడంతో పాటు అన్ని నర్సరీల్లో కలుపు మొక్కలు తీసేసి క్రమ పద్ధతిలో ప్రాంతాల వారీగా విభజించాలన్నారు. గ్రామాల వారీగా మొక్కలు నాటాల్సిన ప్రదేశాల్లో గుంతలు తవ్వి ఆయా ప్రాంతాల వారీగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. టీజీఎఫ్‌ఎంఐఎస్‌ సైట్‌లో ప్రతి వారం గతంలో నాటి మొక్కల స్థితిగతులను నమోదు చేసి రోజు వారీగా మొక్కలు నాటే అంశాలను నమోదు చేయాలని సూచించారు.

రహదారులకు ఇరువైపులా సరిహద్దులు ఫిక్స్‌ చేయాలి  

ఆర్‌అండ్‌బీ పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని రహదారులకు ఇరువైపులా సరిహద్దులు ఫిక్స్‌ చేసి ఎవరూ ఆక్రమణకు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లాలో రహదారుల పక్కన ఆక్రమణ చేయడంపై ప్రతి మండల అదనపు కార్యక్రమ అధికారి, ఎంపీడీవో, సహాయక ఇంజినీర్‌ అధికారులు సమన్వయంతో కలిసి బార్డర్లు గుర్తించి రెండు వరుసల మొక్కలు నాటేవిధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డికి సూచించారు. జిల్లాలో మున్సిపాలిటీల్లో రహదారులు, ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి శనివారంలోపు కలెక్టర్‌కు నివేదిక సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌కు ఆదేశించారు.  

రంజాన్‌ మాసం ఎంతో పవిత్రమైంది..

సిద్దిపేట అర్బన్‌/ సిద్దిపేట కలెక్టరేట్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ రంజాన్‌ మాసంలో నిరుపేద ముస్లింలు ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని రంజాన్‌ కానుకలను అందిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్స్‌లో  మంగళవారం సిద్దిపేట ఫౌండేషన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు మంత్రి హరీశ్‌రావు రేషన్‌కిట్స్‌ను అందజేశారు. అంతకుముందు సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని 22వ వార్డులో విద్యానగర్‌ కాలనీ సీసీ రోడ్డుకు, 25వ వార్డులో పోచమ్మ దేవాలయం నుంచి పద్మానాయక ఫంక్షన్‌హాల్‌ బైపాస్‌ రహదారి వరకు బీటీ రోడ్డుకు, 29వ వార్డులో గాడి చర్లపల్లి బస్టాప్‌ నుంచి ఎల్లమ్మకట్ట వరకు సీసీ రోడ్డు, ఎల్లమ్మ దేవాలయం నుంచి ఎస్సీ కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు వికలాంగులతో సకలాంగులకు జరిగిన వివాహ ప్రోత్సాహకంగా లక్ష రూపాయల చెక్కులను 15 జంటలకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, కౌన్సిలర్లు మచ్చవేణుగోపాల్‌రెడ్డి, ఉమారాణి శ్రీనివాస్‌, ప్రవీణ్‌కుమార్‌, బర్ల మల్లికార్జున్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ లక్ష్మణ్‌, ఫౌండేషన్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా సంఘాలతో మాస్క్‌లు కుట్టించాలి 

జిల్లాలో స్వయం సహాయక బృందాలతో మాస్క్‌లను కుట్టించి సరఫరా చేయించడం ద్వారా మహిళా సంఘాలకు స్వయం ఉపాధి లభిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కరోనా ఇప్పట్లో పోయేలా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలన్నారు. ప్లాస్టిక్‌ మాస్క్‌లు వాడొద్దని, కాటన్‌ బట్టలతో చేసిన మాస్క్‌లు మాత్రమే ధరించాలన్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణ జరుగుతున్నదని మంత్రి సూచించారు.  


logo