మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - May 19, 2020 , 00:29:27

ప్రత్యామ్నాయంతోనే లాభాలు

ప్రత్యామ్నాయంతోనే లాభాలు

పెరుగుతున్న సన్న బియ్యం వాడకం 

సమగ్ర సాగు విధానంతో మంచి దిగుబడులు

సాగు దిశగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

రైతులను సమాయత్తం చేస్తున్న వ్యవసాయ శాఖ

దావత్‌లు.. మధ్యాహ్న భోజనం.. హాస్టళ్లతోపాటు సామాన్యులు సైతం నిత్యం సన్నబియ్యాన్నే ఆహారంగా వాడుతున్నారు. రేషన్‌ లబ్ధిదారుల్లో చాలావరకు దొడ్డు బియ్యం తినడం లేదు.. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సన్న రకం వరి సాగు చేస్తే రైతన్నలు లాభాలు గడించవచ్చు. రైస్‌మిల్లర్లు దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్‌తో సన్నబియ్యంగా మార్చే అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చన్నదే సర్కార్‌ యోచన.. ఎవుసాన్ని పండుగలా మార్చాలన్న సదుద్దేశంతో సాగు విధానంలో విఫ్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. మూస పద్ధతిలో సాగు చేయకుండా డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయాలని సూచిస్తున్నది. సీఎం  కేసీఆర్‌ సమగ్ర సాగు విధానంపై రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆ దిశగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులను సమాయత్తం చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.

 గజ్వేల్‌: సన్న రకం వరి ధాన్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. మిల్లర్లు దొడ్డు రకం ధాన్యానికన్నా కాస్త ఎక్కువ ధరకు కొనుగోలు చేసి బియ్యంగా మార్చి అధిక లాభాలను పొందుతున్నారు. సన్నరకం వరిసాగు కాలపరిమితి ఎక్కువని, దోమ పోటు వంటి తెగుళ్ల బెడద అధికమని రైతులు అపోహలను పెంచుకున్నారు. సమగ్ర సాగు విధానాలను పాటించి, వడ్లను బియ్యంగా మార్చితే లాభాలను పొం దవచ్చన్నది సీఎం కేసీఆర్‌ ఉద్దేశం. ఆ దిశగా రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ఆయకట్టు సాగు విస్తీర్ణం పెరిగింది. వరితో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నది. ప్రభుత్వ హాస్టళ్లు, మధ్యాహ్న భోజనంతోపాటు సామాన్యులు సైతం సన్నబియ్యాన్ని ఎక్కువగా వాడుతున్నారు. సమగ్ర సాగు యాజమాన్య పద్ధతులకు మార్కెటింగ్‌ అనుభవాన్ని జోడిస్తే దిగుబడులు పెరిగి లాభాలు రైతు సొంతమవుతాయని వ్యవసాయ నిఫుణులు పేర్కొంటున్నారు.

అందుబాటులో లోకల్‌, హైబ్రీడ్‌ రకాలు

సన్న రకాల వడ్లలో లోకల్‌, హైబ్రీడ్‌ రకాలు రుచి, నాణ్యత పరంగా మంచి గుర్తింపు పొందాయి. బీపీటీ 5204, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048) రకాలు సన్న లోకల్‌ రకాలుగా ప్రాచుర్యం పొందాయి. కావేరీ కంపెనీకి చెందిన చింటు, బయోజిన్‌ కంపెనీకి చెందిన గంగోత్రి, మంచి రుచి, నాణ్యతతో పాటు అధిక దిగుబడి ఇచ్చే సన్న హైబ్రీడ్‌ రకాలుగా వినియోగదారుల మెప్పు పొందాయి. ఇంకా సాయిమాన్‌, సూపర్‌అమన్‌, జైశ్రీరాం వంటి హైబ్రీడ్‌ రకాలు కూడా సాగవుతున్నాయి.  

సన్న రకాల సాగే లాభదాయకం

 బీపీటీ రకం వడ్లకు గత వానకాలంలో క్వింటాలుకు రూ.1900లు చెల్లించి మిల్లర్లు కొనుగోలు చేశారు. బియ్యం చేసి క్వింటాలుకు రూ.3800లకు విక్రయించారు. క్విం టాలు వడ్లు మిల్లింగ్‌ చేస్తే 65 కిలోల బియ్యం వస్తుంది. ఈ 65కిలోల బియ్యాన్ని విక్రయిస్తే రూ.2470లు వస్తాయి. అంటే ఒక క్వింటాలు వడ్లను బియ్యం చేసి విక్రయిస్తే రూ.570 లాభం వస్తున్నది. ఈ లెక్కన ఎకరాకు సుమారు 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చిన వడ్లను బియ్యం చేసి విక్రయిస్తే రైతుకు రూ.15,960 అదనంగా లాభం వస్తుంది. నిల్వ చేసి అమ్ముకుంటే లాభాలు పెరిగే అవకాశాలుంటాయి. 

మూడేండ్లుగా సన్న వడ్లును బియ్యం చేసి అమ్ముతున్నా

ప్రతి వానకాలం సన్న రకాలనే సాగు చేస్తా. బీపీటీ, తెలంగాణ సోనా రకాలు వేస్తా. వడ్లను మిల్లింగ్‌  చేసి ఇంటికి అవసరం ఉన్నన్ని ఉంచుకుని మిగతావి అమ్ముతున్నా. వడ్లు అమ్మిన దానికన్నా ఎక్కువ లాభం వస్తున్నది. మూడేండ్ల కింద సన్న బియ్యం ధర బాగా పెరిగింది. అప్పుడు  మంచి లాభం వచ్చింది. సన్న రకాలకు కోతలప్పుడు ధరలేదని వ్యాపారులు తక్కువ ధరకు కొని బియ్యం ధర పెరిగిన తర్వాత లాభాలకు అమ్ముకుంటారు. సీఎం సారు చెప్పేది నిజమే. సన్న రకం వరి సాగుతో మంచి లాభాలు పొందవచ్చు. 

- ఎర్ర కొండల్‌రెడ్డి, రైతు (శేరిపల్లి)


logo