మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - May 18, 2020 , 01:28:38

అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు

అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు

సిద్దిపేట రూరల్‌: రూపాయి ఖర్చు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్‌ మండలంలోని రావురూకులలో 24, తోర్నాల గ్రామాల్లో 24 చొప్పున నూతనంగా నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంత్రి హరీశ్‌రావు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు మండల పరిధిలోని ఇర్కోడులో నూతనంగా నిర్మించిన 9 గొర్రెల షెడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. త్వరలోనే కాలంతో పని లేకుండా మండలంలోని అన్ని చెరువులు, కుంటలు నింపుతామన్నారు. రావురూకులలో రూ. 40 లక్షల ఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి, తోర్నాలలో రూ.70 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, ఎంపీపీ శ్రీదేవి చందర్‌రావు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌, ఎంపీడీవో సమ్మిరెడ్డి, తాసిల్దార్‌ పరమేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

నీళ్లను చూస్తుంటే సంబురమైతుంది 

- ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ 

కాల్వల వెంట నీళ్లు చూస్తుంటే సంబురమైతుంది. గోదావరిపై పాడిన పాటలు గుర్తుకు వస్తున్నాయి. ఇలాంటి శుభ సందర్భంలో సొంత గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను పుట్టి పెరిగిన గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తాను. రావురూకులలో పోచమ్మ గుడి నిర్మాణానికి కృషి చేస్తాను. 

కుట్టు మిషన్లు, రంజాన్‌ తోఫాలు పంపిణీ 

సిద్దిపేటలోని చేనేత సహకార సంఘ భవనంలో ఎంపీ నిధులు రూ.5 లక్షలతో 32 కుట్టుమిషన్లను నీలకంఠ సమాజం మహిళా సమాఖ్యకు మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి కుట్టుమిషన్లు అందజేశారు. అలాగే, 22వ వార్డులోని గణేశ్‌నగర్‌లో లబ్ధిదారులకు కందిపప్పు పంపిణీ చేశారు. కాగా, సిద్దిపేటలో శనివారం రాత్రి మంత్రి హరీశ్‌రావు 300 మంది ముస్లింలకు రంజాన్‌ తోఫాలను మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి అందజేశారు. ఇదిలా ఉండగా, నంగునూరు మండలం రాంపూర్‌లో మత్తడి దుంకుతున్న గడ్డమోనీకుంటకు మంత్రి హరీశ్‌రావు జలహారతిపట్టి పుష్పాభిషేకం చేశారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం

కరోనా వ్యాధి నిర్మూలన కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఆదివారం సంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫైన్‌ క్యాబ్‌ అధినేత బ్రిజ్‌ గోపాల్‌ 2.5 లక్షలు, ముఖేష్‌ మిల్స్‌ అధినేత ముఖేష్‌ 1.5 లక్షలు మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు.  

బీజేఆర్‌ జంక్షన్‌ సుందరీకరణ

 బీజేఆర్‌ జంక్షన్‌ సుందరీకరణ అదిరింది. చాలా అద్భుతంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి సిద్దిపేటలోని బాబు జగ్జీవన్‌రామ్‌ సర్కిల్‌ (బీజేఆర్‌ చౌరస్తా)లో రూ.22 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దిన ఈ జంక్షన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) కార్యాలయం ఆవరణలో ఫౌంటెయిన్‌, సుడా చైర్మన్‌ హాల్‌, వైస్‌ చైర్మన్‌హాల్‌, మీటింగ్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, కార్యాలయ సిబ్బంది హాల్స్‌ను ఆయన ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌తో కలిసి ప్రారంభించారు. 


logo