సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - May 18, 2020 , 01:28:41

సిద్దిపేట తాగునీటి కోసం రూ. 380 కోట్లు

సిద్దిపేట తాగునీటి కోసం రూ. 380 కోట్లు

సిద్దిపేట కలెక్టరేట్‌: సిద్దిపేట మున్సిపాలిటీ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి నాబార్డు ద్వారా రూ.380 కోట్లు మంజూరయ్యాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శనివారం సుడా కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ యశ్వాడ నుంచి సిద్దిపేటకు 10 మిలియన్‌ లీటర్ల నీటిని తెచ్చేందుకు ప్రతి నెల రూ.కోటి 33 లక్షల ఖర్చు వస్తుందన్నారు. మల్లన్నసాగర్‌ నుంచి నీళ్లు ఇచ్చేందుకు కొండపాకలో కొత్తగా 200 ఎంఎల్‌డీల ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ సిద్ధంగా ఉందని, అక్క డి నుంచి ప్రస్తుతం సిద్దిపేటకు 18 ఎంఎల్‌డీల నీటిని కేవలం కోటి రూపాయల ఖర్చుతో ప్రతి రోజు అందించవచ్చని చెప్పుకొచ్చారు. ఇందుకోసం కొండపాక ఫిల్టర్‌ బెడ్‌ వద్ద సింగిల్‌ పంపింగ్‌ చేసేలా అధికారులు రూపొందించిన ప్రతిపాదనలపై ఆరా తీశారు. మున్సిపాలిటీ వార్డులోని 10 ట్యాంకులు, విలీన గ్రామాల్లోని 45 ట్యాంకులకు 21 కి.మీ మేర గ్రావిటీ ద్వారా తాగునీరు అందించవచ్చని అధికారులు తెలిపారు.  రానున్న 30 ఏండ్ల వరకు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించామన్నారు. పరిశ్రమలకు 10 శాతం అదనంగా తాగునీరు అందించేందుకు కేటాయింపులు చేయాలని సూచించారు. ప్రతి వ్యక్తికి అర్బన్‌ ప్రాంతంలో 135 లీటర్ల నీళ్లిచ్చేలా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. పట్టణంలోని ఎర్రచెరువుకు మల్లన్నసాగర్‌ నీళ్లు వస్తాయని ప్రత్యామ్నాయంగా 7.5 ఎంఎల్‌డీ నీళ్లు ఎర్రచెరువులో ఉండేవిధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఎర్రచెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చేందుకు అవసరమైన మట్టి పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. 

తాజావార్తలు


logo