మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - May 14, 2020 , 22:37:54

6 రోజుల్లో రూ. 69.83 కోట్లు

6 రోజుల్లో రూ. 69.83 కోట్లు

  • ఉమ్మడి జిల్లాలో 1,01,223 కేసుల లిక్కరు, 46,061 బీర్లు సేల్‌

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూతపడిన వైన్స్‌లు ఒక్కసారిగా తెరుచుకోవడంతో జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో మొత్తం 193 వైన్స్‌లు ఉండగా ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు కేవలం 6 రోజుల్లో రూ.69.83 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే లిక్కరు పెద్దఎత్తున అమ్ముతుండగా బీర్ల అమ్మకాలు మాత్రం ఒక్కసారిగా పడిపోవడం గమనార్హం. సాయంత్రం 6 గంటలకే వైన్స్‌లు మూసివేస్తుండటం, బీర్ల గడువు ముగిసిందనే ప్రచారం జరుగడంతో వాటిని తాగడానికి ఎవరు ఇష్టపడటం లేదని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. కాగా గత ఏడాది మే నెలతో పోల్చితే ఈ నెల మొత్తంలో అమ్మిన లిక్కర్‌లో 6రోజుల వ్యవధిలోనే 46.07 శాతం అమ్మకాలు జరుగడం విశేషం. 

193 వైన్స్‌లు, లక్ష కేసుల లిక్కర్‌ సేల్‌..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 13 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో సంగారెడ్డి 85, సిద్దిపేట 70, మెదక్‌ 38 మొత్తం 193 వైన్స్‌లు ఉన్నాయి. ఈ వైన్స్‌ల్లో గత ఏడాది మే నెలలో 2,19,716 కేసుల లిక్కర్‌, 5,30,891 కేసుల బీర్లు కలిసి మొత్తం రూ.158.45 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సరాసరి చూసుకుంటే ప్రతి నెల ఉమ్మడి జిల్లాలో రూ.150 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌ తరువాత 8న వైన్స్‌లు తెరుచుకోగా 13వ తేదీ వరకు 6 రోజుల్లోనే పెద్దఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. అయితే గత ఏడాది మే నెలతో పోల్చితే ఇప్పుడు ఆరు రోజుల్లోనే 46.07 శాతం మద్యం అమ్ముడుపోయింది. ఈ ఆరు రోజుల్లో 1,01,223 కేసుల లిక్కర్‌, 46,061 కేసుల బీర్లు మొత్తం రూ.69.83 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అయితే 46.07 శాతం లిక్కరు అమ్ముడుపోయినప్పటికీ బీర్లు మాత్రం గత ఏడాది మే నెలతో పోల్చితే కేవలం 8.67 శాతం అమ్ముడుపోవడం గమనార్హం. అయితే బార్లు మూసి ఉండటం కూడా బీర్లు తక్కువగా అమ్ముడుపోవడానికి మరో కారణంగా అధికారులు చెబుతున్నారు.


logo