శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - May 14, 2020 , 00:40:17

రైతు రాజ్యం వచ్చింది..

రైతు రాజ్యం వచ్చింది..

  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
  • నంగునూరు, సిద్దిపేట పెద్దవాగులపై చెక్‌డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన 
  • సిద్దిపేటలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

నంగునూరు/సిద్దిపేట కలెక్టరేట్‌ : ‘గత ప్రభుత్వాల హయాంలో పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటర్లతో రైతులు అప్పుల పాలయ్యారు.., టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే నిజమైన రైతురాజ్యం వచ్చింది’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం నంగునూరు పెద్దవాగుపై రూ.4 కోట్ల 60 లక్షలు, రూ.4 కోట్ల 75 లక్షలతో రెండు చెక్‌డ్యాంలు, సిద్దిపేట పెద్దవాగుపై దర్గపల్లిలో రూ.2 కోట్ల 75 లక్షలతో మరో చెక్‌డ్యాం నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంగునూరు పెద్ద వాగుకు ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుకు లింకు చేసి 365 రోజులు చెక్‌డ్యాంలు మత్తళ్లు దుంకేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నంగునూరు పెద్దవాగుపై 9 చెక్‌డ్యాంలను నిర్మించనున్నామన్నారు. సిద్దిపేట పెద్దవాగుపై 28 చెక్‌డ్యాంలు, కానుగు ఒర్రెపై 6 చెక్‌డ్యాంలను గోదావరి జలాలతో నింపుతామన్నారు. నంగునూరు మండలాన్ని రాజీవ్‌ రహదారికి అనుసంధానం చేసేందుకు 30 కి.మీ మేర రూ.30 కోట్లతో నంగునూరు, నర్మెట మీదుగా బక్రిచెప్యాల, నాంచారుపల్లి రాజీవ్‌ రహదారి వరకు డబుల్‌ రోడ్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నర్మెట గ్రామంలోని గద్దలాయచెరువులో జలహారతి పట్టిన అనంతరం శివాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. 

పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ..

సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్‌లో సిద్దిపేట రూరల్‌, అర్బన్‌ మండలాలకు చెందిన రైతులకు మంత్రి పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసి మాట్లాడారు. ‘కాళేశ్వరం’ నీళ్లు వచ్చాక మొదటి కార్యక్రమమని, నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్‌, సిద్దిపేట అర్బన్‌ మండలాలు మినహా అన్ని మండలాలకు ‘కాళేశ్వరం’ జలాలు వచ్చాయన్నారు. జలశయాల కోసం ఊర్లకు ఊర్లు  త్యాగం చేశారని, కాల్వల భూ సేకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. 

సిద్దిపేటలో నల్లా కనెక్షన్‌ లేని ఇల్లు ఉండొద్దు..  

‘సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలో నల్లా కనెక్షన్‌ లేని ఇల్లు ఉండొద్దు.. యూజీడీ కనెక్షన్లను త్వరగా పూర్తి చేయాలి.. మల్లన్నసాగర్‌ పూర్తయితే తాగునీటి ఖర్చు తగ్గుతుంది కాబట్టి సిద్దిపేటకు వరమవుతుంది’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ రాజనర్సు అధ్యక్షతన జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో 2019-20 సవరణ బడ్జెట్‌, 2020-21కి సంబంధించిన బడ్జెట్‌ను ఆమోదించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నెలనెలా తాగునీటికి రూ.కోటి ఖర్చు చేస్తున్నామని, ఏడాదికి వచ్చే ఆదాయం కేవలం రూ.3 కోట్లేనన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీకి తాగునీటి కోసం నాబార్డు నుంచి రూ.380 కోట్లు మంజూరు చేయించామన్నారు.   

రంజాన్‌ కానుకగా నిత్యావసర సరుకుల పంపిణీ  

‘కరోనా వైరస్‌ రోజురోజుకు హెచ్చుతగ్గులవుతుంది, ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి.. భౌతిక దూరం పాటించాలి’ అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేటలోని నిమ్ర, బాలాజీ గార్డెన్‌లో ఆర్‌ఆర్‌ గ్రూప్స్‌ సయ్యద్‌ మహముదుద్దీన్‌, మైమేన్‌ గ్రూప్స్‌ సౌజన్యంతో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి మంత్రి 2 వేల మంది ముస్లింలకు రంజాన్‌ కానుకగా 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, జడ్పీటీసీలు ఉమావెంకట్‌రెడ్డి, శ్రీహరిగౌడ్‌, తహసీల్దార్‌ పరమేశ్వర్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ బాల్‌రంగం, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, సిద్దిపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అక్తర్‌ పాల్గొన్నారు. 


logo