సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - May 12, 2020 , 00:22:48

పుట్లకు పుట్టు..

పుట్లకు పుట్టు..

  • ధాన్యపు రాసులతో కొనుగోలు కేంద్రాలు కళకళ
  • యాసంగిలో 2.24 లక్షల ఎకరాల్లో వరిసాగు
  • 6.26 లక్షల టన్నుల దిగుబడి అంచనా
  • ఉమ్మడి జిల్లాలో 633 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మెతుకుసీమలో ధాన్యపు రాసులు దర్శనమిస్తున్నాయి. వడ్ల బస్తాలు, రాసులతో కొనుగోలు కేంద్రాలు కళకళలాడుతున్నాయి. గతేడాది యాసంగితో పోల్చితే పోయిన యాసంగిలో 1.06 లక్షల ఎకరాల్లో అదనంగా వరి సాగైంది. గడిచిన యాసంగిలో 2.24 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, 6.26 లక్షల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలోని మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేసిన 633 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.06 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. రూ.561 కోట్ల విలువ చేసే వడ్లు కొనుగోలు చేసి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వమే మద్దతు ధర క్వింటాలుకు రూ.1,835కు చెల్లిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 1.22 లక్షల ఎకరాల్లో..

ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో గడిచిన యాసంగిలో 1.22 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ జిల్లా నుంచే 3.92 లక్షల టన్నుల వడ్ల దిగుబడి రానున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. మెదక్‌ జిల్లాలో 79 వేల ఎకరాల్లో వరిసాగవగా, 1.77 లక్షల టన్నుల దిగుబడి, సంగారెడ్డి జిల్లాలో 23,563 ఎకరాల్లో వరి సాగవగా, 56 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానున్నట్లు అంచనా వేశారు. గతేడాది యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 1,17,920 ఎకరాల్లో వరిసాగవగా, ఆ సంఖ్య పోయిన యాసంగిలో 2.24 లక్షలకు ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 2.67 లక్షల టన్నుల నుంచి 6.26 లక్షల టన్నులకు పెరిగింది.  


టోకెన్ల పద్ధతిలో కొనుగోలు..

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్‌ యార్డులను మూసివేసినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా 100 ఎకరాలకు పైగా వరిసాగు చేసిన గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 633 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు టోకెన్లు అందించి అందులో సూచించిన రోజు ప్రకారం వచ్చిన వారి నుంచి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన తరువాత నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. వడ్ల కేంద్రాల నుంచి ఆయా జిల్లాలో గుర్తించిన రైస్‌ మిల్లులకు తరలించి బియ్యం పట్టిస్తున్నారు. అలా వచ్చిన బియ్యాన్ని ప్రజా పంపిణీ కోసం గోదాముల్లో నిలువ చేస్తున్నారు. 

ఈ సారి గుంట జాగా ఎండలేదు

నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ప్రతి యాసంగికి మూడు ఎకరాలు నాటు వేసేటోళ్లం. తీరా వరి ఈనే సమయానికి నీళ్లు అందక వేసిన పంట ఎండి పోయేది. తెలంగాణ సర్కార్‌ తపాస్‌పల్లి రిజర్వాయర్‌ నీళ్లతో ఈ ప్రాంతంలో ఉన్న చెరువులను నింపింది. దీంతో ఈసారి ఎన్నడూ లేనివిధంగా గుంట జాగా కూడా ఎండకుండా పంట పండించిన. 83 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.  

  - బచ్చల తిరుపతి, రైతు, గురువన్నపేట

సర్కారు రైతులకు మంచి చేస్తున్నది 

కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వడ్లను జల్దిజల్దిగా కొంటుర్రు, దీంతో మాకు చానా ఇబ్బంది తప్పింది. కేసీఆర్‌ సర్కారోల్లు రైతులకు అన్నివిధాలుగా మంచి చేస్తున్నరు. నాకంటే ముందు వడ్లు అమ్మినోళ్లకు పైసలు వచ్చినయి.

- కడ్డూరి రాములు, రైతు, ఆకునూరు

వడ్లు ఎండంగనే కొన్నరు.... 

వడ్లుకొనే కేంద్రం దగ్గరికి మూడురోజుల కిందట వడ్లు తెచ్చినం. ఈడనే వడ్లు ఆరబోసినం, అవి ఎండంగనే సార్లు కాంటాపెట్టిండ్రు. కొన్న వడ్లను ఇవ్వాల ట్రాక్టర్లలో మిల్లుకు తీసుకుపోయిండ్రు. 

- పోతరవేని బాలయ్య, రైతు, హుస్నాబాద్‌ 

మద్దతు ధరకు కొని డబ్బులు వేశారు 

మాకు ఐదెకరాల వ్యవసాయం ఉంది. మూడు ఎకరాలు వేశాం. మాకు ఈసారి పంట దిగుబడి బాగా వచ్చింది. రంగనాయకసాగర్‌తో మల్యాలకు నీళ్లు వస్తున్నాయి. మొత్తం ఐదెకరాలు వేస్తాం. వడ్లను బీట్లో పోయగా నాలుగు రోజుల్లో ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసింది. డబ్బులు పడ్డాయి. సీఎం కేసీఆర్‌ సార్‌కు కృతజ్ఞతలు.

         - ఏటి శంకరవ్వ, మల్యాల

25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది

యాసంగిలో ఎకరం పదిగుంటల్లో వరి సాగుచేసిన. 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. లాక్‌డౌన్‌లో వడ్లు ఎక్కడ అమ్ముకోవాల్సి వస్తుందోనని భయపడిపోయినం. సర్కారు మా ఊర్లోనే కేంద్రం ఏర్పాటు చేసింది. రూ.1,835 మద్దతు ధరకు కాంటా పెట్టిన. రూ.45 వేల వరకు వచ్చాయి. ప్రతి రైతు నుంచి వడ్లు కొనుగోలు చేసే వరకు కేంద్రాలు పనిచేస్తాయని అధికారులు హామీ ఇచ్చారు. రైతులంతా సంతోషంగా ఉన్నారు.

     - చిటుకుల యాదవరెడ్డి, మక్కరాజు పేట రైతు

కాలువ బాగుతోనే పంటపండింది..

నల్లవాగు ప్రాజెక్టు కింద కుడి కాలువలు బాగుచేయడంతోనే ఈసారి నా పంట పండింది. వర్షాలు లేక చెరువు, కుంటల్లో నీరు లేకపోయినా ప్రాజెక్టులోని నీటిని పంటలకు అందించారు. వారం రోజుల్లో వరికోతలు మొదలు పెడతం. రైతుల కోసం పనిచేసే సర్కారు ఉంటే మాకు ఢోకా ఉండదు.

- సత్యనారాయణగౌడ్‌, గోసాయిపల్లి, సిర్గాపూర్‌ మండలంlogo