గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - May 10, 2020 , 01:12:55

గోదారమ్మ ‘గొలుసు’

గోదారమ్మ ‘గొలుసు’

  • రంగనాయక సాగర్‌ కుడి కాల్వ ద్వారా చెరువుల్లోకి గోదావరి జలాలు
  • మత్తళ్లు దుంకుతుండడంతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు 

నంగునూరు: వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదారమ్మ కండ్ల ముందట వాగులు, వంకలు, చెరువులు, కుంటల్లో పారుతుంటే రైతన్నల ముఖాల్లో సంబురం నెలకొన్నది. కాలమైతే తప్ప నిండని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలలో కాలం కానీ సమయంలోనూ మత్తళ్లు దుంకుతున్నాయి. రంగనాయకసాగర్‌ కుడి కాల్వ ద్వారా నంగునూరు మండలంలో మొదటి విడుతలో భాగంగా గొలుసు కట్టు చెరువులను గోదావరి జలాలతో నింపేలా మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మండలంలో 24 గ్రామాల్లో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు మొత్తం కలిపి 208 ఉన్నాయి. మొదటి విడుతలో 14 గ్రామాల్లో సుమారు 35 చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలను నింపనున్నారు. ఇప్పటి వరకు మగ్దుంపూర్‌ శివారులోని రాక్‌ కుంట, ఆంక్షాపూర్‌ ధర్మసాగర్‌గండి, మైసంపల్లి దయ్యపోని చెక్‌డ్యాం, వెంకటాపూర్‌ నాగులకుంట, ముండ్రాయి మెరుపుకుంటలు నీటితో నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. వీటితో పాటు నర్మెట గద్దలాయచెరువు, నాగసముద్రం కుంట, అప్పలాయ చెరువు, ముండ్రాయి యజ్ఞం కుంట, కోనాయిపల్లి లోక్‌సాన్‌కుంట నిండగా, రాజగోపాల్‌పేట పెద్ద చెరువు నిండుతున్నది.  

రంగనాయకసాగర్‌ కుడికాల్వతో 40 వేల ఎకరాలకు సాగునీరు 

రంగనాయకసాగర్‌ కుడి కాల్వతో 40 వేల ఎకరాలకు సాగు నీరందనున్నది. ప్రధాన కుడి కాల్వతో నంగునూరు, చేర్యాల, కోహెడ, మద్దూరు, సిద్దిపేట అర్బన్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపనున్నారు. రంగనాయకసాగర్‌ ఎల్‌డీ-4 ద్వారా సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి, నంగునూరు మండలం ముండ్రాయి, రాజగోపాల్‌పేట, ఎల్‌డీ4-1 ద్వారా  నంగునూరు మండలం కోనాయిపల్లి, వెల్కటూర్‌, ముండ్రాయి, ఎల్‌డీ-5 ద్వారా నంగునూరు మండలం ముండ్రాయి, రాజగోపాల్‌పేట, పాలమాకుల, ఎల్‌డీ-6 ద్వారా  కోనాయిపల్లి, వెంకటాపూర్‌, నర్మెట, మగ్దుంపూర్‌, రాంపూర్‌, నంగునూరు, బద్దిపడగ, కోహెడ మండలం బస్వాపూర్‌, ఎల్‌డీ-7 ద్వారా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి, నర్మెట, ఎల్‌డీ-9 ద్వారా చేర్యాల మండలం దానంపల్లి, నంగునూరు మండలం నర్మెట, ఎల్‌డీ-10 ద్వారా చేర్యాల మండలం దానంపల్లి, కమలాయపల్లి, నంగునూరు మండలం మైసంపల్లి, ఖానాపూర్‌, ఆంక్షాపూర్‌, నంగునూరు, ఘణపూర్‌, అక్కెనపల్లి, గట్లమల్యాల, కొండంరాజుపల్లి, ఖాత గ్రామాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నింపనున్నారు. కుడికాల్వ మొత్తం 56 కిలో మీటర్ల మేర నిర్మించారు. ప్రధాన కుడి కాల్వతో పాటు పంట కాల్వలు, పిల్ల కాల్వలు తీసి అన్నింటినీ నింపనున్నారు. 


చానేండ్లకు నిండింది 

మా ఊరి గద్దలాయచెరువు చానేండ్లకు నిండింది. 20 ఏండ్ల కింద చెరువులో నీళ్లు చూసినమంటే మళ్లీ గిప్పుడు సూత్తున్నం. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు దయతో చెరువులో నీళ్లొచ్చినై. రైతులు సంబురంగా ఎవుసం చేసుకోవచ్చు. మండుతున్న ఎండల్లో చెరువులో నీళ్లు సూత్తే ఆనందమైతుంది. 

- నాయిని చంద్రారెడ్డి (నర్మెట) 

కాలమైనా.. కాకున్నా నీళ్లుంటాయి 

ప్రతి ఏడాది వాన పడి చెరువులకు నీళ్లొస్తాయని ఎదురు చూసేటోళ్లం. ఈ ఏడాది వానలు పడకముం దే కాల్వతో చెరువుల్లో నీళ్లు నిండాయి. సీఎం కేసీఆర్‌ మంత్రి హరీశ్‌రావు నీళ్లు తెచ్చి రైతుల గోస తీర్చిన్రు. కాలమైనా కాకున్న చెరువులు, బావులు, బోర్లల్లో నీళ్లుంటాయి. రైతులమంతా సర్కారుకు రుణపడి ఉంటాం. 

- కమలాకర్‌ (ముండ్రాయి)


logo