గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - May 09, 2020 , 00:26:02

రోహిణి కార్తె వరకు నాట్లు పడాలి

రోహిణి కార్తె వరకు నాట్లు పడాలి

  • 50 వేల ఎకరాల్లో సన్నరకాల సాగే లక్ష్యం
  • వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం 

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : నియోజకవర్గంలో రంగనాయకసాగర్‌ ద్వారా కాల్వలకు నీళ్లు చేరాయి. రోహిణి కార్తె వరకు నాట్లు వేసేలా చూడాలి.. ఈ సారి 50 వేల ఎకరాల్లో సన్నరకాల సాగు జరిగేలా చొరవ చూపాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గంలోని మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతుబంధు అధ్యక్షులతో హైదరాబాద్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో సన్నరకాల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జనుము, జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ యేడాది నీళ్లకు ఇబ్బంది లేదని.. 50 వేల ఎకరాల్లో సాగు చేసేలా కృషి చేయాలని వ్యవసాయ అధికారి శ్రావణ్‌కుమార్‌కు సూచించారు. కాలం, కరెంట్‌తో సంబంధం లేకుండా రంగనాయకసాగర్‌ ద్వారా రైతులు రోహిణి కార్తె లోగా నాట్లు పూర్తి చేస్తే  పంట ముందే వస్తుందని.. ఫలితంగా వడగండ్ల కష్టాలు ఉండవన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఇంకా అవసరమైతే చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఉపాధి హామీ కూలీలకు త్వరగా డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే, తెల్లరేషన్‌ కార్డు ఉన్న వారందరికీ ప్రభుత్వం రూ.1500 ఇస్తుందని, బ్యాంకుల్లో రానివారికి పోస్టాఫీసులో తీసుకోవచ్చని పేర్కొన్నారు. 


logo