గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - May 08, 2020 , 06:35:19

కార్తె పంటలతో.. కనకపు రాశులు..!

కార్తె పంటలతో.. కనకపు రాశులు..!

  • రోహిణి కార్తె ప్రారంభంలో నారు పోస్తే అధిక దిగుబడులు
  • విత్తనాలు వేసేందుకు అన్నదాతలు సిద్ధం

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: రోహిణి కార్తెలో వానలు పడగానే విత్తనాలు వేసేందుకు అన్నదాతలు పొలాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకొంటారు. వ్యవసాయశాఖ, ఏరువాక శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యం అవుతాయి. ఇటీవల సీఎం కేసీఆర్‌ పలు సమావేశాల్లో రోహిణి కార్తె పంటలు వేయడానికి అనుకూలమని రైతులకు సూచించారు. మరోపక్క శాస్త్రవేత్తలు రోహిణి కార్తె ఆరంభంలో వర్షాలు పడితే భూమి ఆధారంగా పంటలు వేసుకుంటే మంచిదని చెబుతున్నారు.

కాలం సహకరించాలి...

పూర్వ కాలంలో కార్తెల ఆధారంగా పంటలు వేసుకొని రైతులు దిగుబడులు సాధించారు. నేటి పరిస్థితుల్లో వాతావరణంలో మార్పుల వలన భూమి సాంద్రతను బట్టి పంటలు వేసుకోవడం మంచిది. జూన్‌ మొదటి వారంలో వర్షాలు పడితే రోహిణి కార్తెలో వేసిన పంటలు అధిక దిగుబడులు వచ్చి రైతుకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. ముఖ్యంగా మే చివరి వారం నాటికి దుక్కులు దున్నితే భూమిలో ఉన్న క్రిమీకీటకాలు బయటకు వచ్చి చనిపోవడం, పక్షులు తినడంతో పాటు భూమి బాగా మాగి పంటల దిగుబడికి అనుకూలిస్తుంది.  

- నర్సింగరావు, సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి

సరైన ప్రణాళికతో మంచి దిగుబడి

వరిసాగులో సన్న రకాలు పండించే రైతులు రోహిణి కార్తెలో పంట వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. అయితే దీనిలో కొన్ని రకాలు అనుకూలంగా ఉండవు. కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి పంటను సాగు చేయాలి. సరైన ప్రణాళికతో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి వస్తుంది.

- ఏ.వి రామాంజనేయులు, తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రంముఖ్య శాస్త్రవేత్త

సకాలంలో వానలు పడాలి...

జూన్‌ మొదటి వారంలో వ్యవసాయశాఖ క్యాలెండర్‌ ప్రకారం సకాలంలో వానలు పడితే పంట దిగుబడికి ఇబ్బంది ఉండదు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉండకపోవడంతో అన్నదాతలు వాణిజ్య పంటలపై దృష్టి పెడుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అత్యధిక సంఖ్యలో రైతులు వరి, పత్తి, చెరుకు, మొక్కజొన్న పంటలతో పాటు పప్పుదినుసుల పంటలు సాగు చేసేందుకు పొలాలు సిద్ధం చేశారు. కాగా, కార్తెల ప్రకారం వర్షాలు పడితే అన్నదాతలకు దిగుబడి పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నీటి సాంద్రత ఉన్న ప్రాంతాల్లో పంటల సాగుకు రోహిణి కార్తె అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

భూమిని బట్టి పంటలు వేయాలి

రైతులు తమ భూములను బట్టి పంటలు వేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా రోహిణి కార్తెలో అత్యధిక ఉష్ణోగ్రతలతో భూమి మాగి ఉంటుంది. ఈ సమయంలో పొలం దున్నడంతో భూమిలోని సారాన్ని వెలికి తీయవచ్చు.  రోహిణిలో మొదటి వానకు విత్తనాలు వేసిన రైతులకు అధిక దిగుబడులతో పాటు తాలు లేకుండా గట్టి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.

- కె రాహుల్‌ విశ్వకర్మ, ఏరువాక శాస్త్రవేత్త సంగారెడ్డిlogo